Avengers Endgame: ఏడేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’.. ఈ సినిమా చూడడానికి 5 కారణాలు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మార్వెల్ అభిమానులకు మరోసారి పండగ రాబోతుంది. 2019లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ఇప్పుడు మరోసారి పెద్ద తెరపై సందడి చేయనుంది. అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.

News18
News18

మార్వెల్ అభిమానులకు మరోసారి పండగ రాబోతుంది. 2019లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ఇప్పుడు మరోసారి పెద్ద తెరపై సందడి చేయనుంది. అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. హౌస్‌ఫుల్ షోలు, అర్ధరాత్రి ప్రదర్శనలు, తమ అభిమాన సూపర్‌హీరోల వేషధారణలో థియేటర్లకు వచ్చిన ఫ్యాన్స్.. ఇలా ‘ఎండ్‌గేమ్’ రిలీజ్ ఒక సినిమాకంటే పెద్ద ఈవెంట్‌గా మారింది.

ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ పేరుతో ఈ సినిమా మరోసారి థియేటర్లలోకి వస్తోంది. అంతేకాదు.. త్వరలో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘ఎండ్‌గేమ్’ను మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అసలు ఈ ఎంకోర్‌ను ఎందుకు చూడాలంటే..

1. మార్వెల్‌లో అతిపెద్ద ఈవెంట్‌ను మరోసారి అనుభవించొచ్చు:

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని 22 సినిమాల్లో కొనసాగిన కథలు, పాత్రలను ఒకే సినిమాలోకి తీసుకొచ్చిన ఘనత ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’కు దక్కుతుంది. ఎంతోకాలంగా ప్రేక్షకులు ఎదురుచూసిన కథకు ఈ సినిమా ఒక కీలకమైన ముగింపును అందించింది. ఆ భారీ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లను మరోసారి పెద్ద తెరపై ఆస్వాదించే అవకాశం ఇప్పుడు లభిస్తోంది.

2. కెప్టెన్ అమెరికా ఐకానిక్ సీన్:

‘ఎండ్‌గేమ్’లో కెప్టెన్ అమెరికా, థానోస్ మధ్య జరిగే పోరాటం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సన్నివేశాల్లో ఒకటి. ముఖ్యంగా అవెంజర్స్ హీరోలు ఒక్కొక్కరుగా రంగంలోకి దిగే సమయంలో థియేటర్లలో కనిపించిన ప్రేక్షకుల స్పందన సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఆ సన్నివేశాన్ని మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూడటం అభిమానులకు ప్రత్యేక అనుభూతినే ఇవ్వనుంది.

3. బ్లాక్ విడోకు భావోద్వేగ నివాళి:

నటాషా రోమానోఫ్‌ అలియాస్ బ్లాక్ విడో త్యాగం ‘ఎండ్‌గేమ్’లో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టాల్లో ఒకటి. అవెంజర్స్ కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆమె.. అందరినీ తిరిగి తీసుకురావడానికి తన ప్రాణాలను త్యాగం చేస్తుంది. ఎంకోర్ ప్రదర్శన ద్వారా అభిమానులు మరోసారి ఆమె పాత్రను, త్యాగాన్ని గుర్తు చేసుకునే అవకాశం ఉంది.

4. ఐరన్ మ్యాన్‌కు మరోసారి వీడ్కోలు చెప్పొచ్చు:

టోనీ స్టార్క్ అలియాస్ ఐరన్ మ్యాన్‌కు ‘ఎండ్‌గేమ్’లో ఇచ్చిన వీడ్కోలు మార్వెల్ అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. ఐరన్ మ్యాన్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్ ప్రయాణానికి ఇది కీలకమైన ముగింపుగా నిలిచింది. ప్రస్తుతం ఆయన మళ్లీ MCUలో డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించనున్న నేపథ్యంలో ‘ఎండ్‌గేమ్’ను మరోసారి చూడటం అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారింది.

5. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’పై ఆసక్తి పెంచే ప్రివ్యూ:

ఎంకోర్ ప్రదర్శనలో రాబోయే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’కు సంబంధించిన ప్రత్యేక ప్రివ్యూ కూడా ఉండనుంది. MCUలోని విభిన్న ప్రాంతాలకు చెందిన హీరోలను ఒకే కథలోకి తీసుకువస్తున్న ‘డూమ్స్‌డే’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ‘ఎండ్‌గేమ్: ఎంకోర్’ ప్రదర్శనలో ఈ ప్రివ్యూ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచనుంది.

‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ సెప్టెంబర్ 25న భారత్‌లో విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లోనూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ రీ-రిలీజ్ అయినప్పటికీ.. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’కు ముందు MCU అభిమానులకు మరోసారి ఈ మెగా ఈవెంట్‌ను పెద్ద తెరపై అనుభవించే అవకాశంగా నిలవనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports