Last Updated:
తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న చిరంజీవి, తన సుదీర్ఘ ప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులను సత్కరించి, వారితో తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు చూస్తే..
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దాదాపు ఐదు దశాబ్దాలుగా టాప్ హీరోగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినీ రంగంలోకి అడుగుపెట్టి 48 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ అరుదైన మైలురాయిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ‘మెగా యూత్ ఫోర్స్’ (Mega Youth Force) ఆధ్వర్యంలో ఇటీవల ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న చిరంజీవి, తన సుదీర్ఘ ప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులను సత్కరించి, వారితో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన తాజా చిత్ర విశేషాలతో పాటు జీవితంలో క్రమశిక్షణ ప్రాముఖ్యతను వివరించారు.
ప్రస్తుతం తాను నటిస్తున్న కొత్త చిత్రం ‘కాకా’ గురించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో తాను ‘కదిరి కాళిదాసు’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పేశారు. ఈ సినిమా కోసం భారీ యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నామని తెలిపారు. తన దినచర్యను వివరిస్తూ.. “ప్రతిరోజూ తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్రలేస్తాను. గంటపాటు తప్పనిసరిగా వ్యాయామం చేసిన అనంతరం, మేకప్ పూర్తి చేసుకుని ఉదయం 8 గంటలకల్లా కోకాపేటలోని షూటింగ్ సెట్స్‌కు చేరుకుంటాను.
నేను ఉదయం 10 గంటలకు వెళ్లినా నన్ను అడిగేవారు ఎవరూ ఉండరు. కానీ, నేను క్రమశిక్షణ పాటించకపోతే మిగతా టీమ్ ఎలా ఉంటుంది? ఒక సినిమా అనేది ఎంతోమంది సమిష్టి కృషి. ప్రతి ఒక్కరి సమయం ఎంతో విలువైనది. అందుకే సెట్స్‌లో నా వంతు బాధ్యతగా సమయపాలన పాటిస్తాను” అని ఆయన వివరించారు. తన దర్శకులు సైతం ఉదయం 7 గంటలకే సెట్స్‌లో సిద్ధంగా ఉంటారని ప్రశంసించారు.
ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడికైనా, ఒక సాధారణ కార్మికుడికైనా రోజుకు ఉండేది 24 గంటలేనని, ఆ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుందని చిరంజీవి యువతకు సూచించారు. తన 48 ఏళ్ల సినీ ప్రయాణంలో అభిమానులు కురిపించిన ప్రేమాభిమానాలే తనకు కొండంత బలాన్ని ఇచ్చాయన్నారు. ‘మెగా యూత్ ఫోర్స్’ రాబోయే రోజుల్లో మరింత బలోపేతం కావడానికి అభిమానుల సహకారం ఎంతో అవసరమని ఆయన కోరారు. ప్రేక్షకులు తన నుంచి ఆశించే వినోదాన్ని, మంచి సినిమాలను అందించడమే తన బాధ్యతగా భావిస్తానని, మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని చిరంజీవి స్పష్టం చేశారు.














