SIR Notices: సర్ నోటీసులపై స్పందించని 50శాతం మంది ఓటర్లు.. మరి వాళ్లందరికి ఓటు హక్కు లేనట్లేనా..! | తెలంగాణ వార్తలు | ACTPnews

SIR Notices: సర్ నోటీసులపై స్పందించని 50శాతం మంది ఓటర్లు.. మరి వాళ్లందరికి ఓటు హక్కు లేనట్లేనా..! | తెలంగాణ వార్తలు


నోటీసులపై స్పందించని జనం..

కొత్త ఓటర్ల నమోదు.. లేని ఓటర్ల పేర్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్ (SIR) పేరుతో ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ ప్రక్రియతో తెలంగాణలో 43 లక్షల ఓట్లు ప్రమాదంలో పడిన పరిస్థితి ఉన్నట్లుగా కనిపిస్తోంది. సర్ అప్లికేషన్స్‌లో ఓటర్ల వివరాలు సరిగా లేకపోవడం వంటి పొరపాట్లతో 82 లక్షల్లో 38 లక్షల మందికి నోటీసులు ఇచ్చారు. అయితే ఇందులో 43 లక్షల మంది నోటీసులపై స్పందించలేదు. అంటే సర్ నోటిఫికేషన్స్ ఇచ్చిన వారిలో సగానికిపైగా 53% మంది వివరణ ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో 96% మంది విచారణకు గైర్హాజరైనట్లుగా తెలుస్తోంది.

సీఎం నియోజకవర్గం టాప్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో 66,342 మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారు అధికారులు. వారిలో విచారణకు 63,984 మంది ఓటర్లు హాజరు కాలేదు. అంటే ఈ ఒక్కచోటే సర్ ప్రక్రియను ఏమాత్రం లెక్కచేయని ఓటర్ల సంఖ్య 96 శాతంగా ఉంది. ఆ తర్వాత జంటనగరాల పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ మొత్తం 3.03 లక్షల మందికి నోటీసులు ఇవ్వగా 2.48 లక్షల మంది స్పందించకపోవడం గమనార్హం.

ఇక జిల్లాల వారిగా సర్ నోటీసులకు స్పందించని వారి వివరాలు

మేడ్చల్-మల్కాజ్‌గిరి – 8,31,316

రంగారెడ్డి – 6,03,149

హైదరాబాద్ – 5,13,264

సంగారెడ్డి – 2,24,058

నిజామాబాద్ – 1,64,435

వికారాబాద్ – 1,63,603

సూర్యాపేట – 1,50,671

నల్గొండ – 1,49,754

భద్రాద్రి కొత్తగూడెం – 1,41,726

మహబూబ్‌నగర్ – 1,31,249

వరంగల్ – 1,16,165

నిర్మల్ – 1,06,965

కరీంనగర్ – 1,01,945 మంది ఓటర్లు నోటీసులకు స్పందించలేదు

అయితే అసలు రీజన్ ఏంటీ..

గుర్తింపు కార్డు చూపిన 38 లక్షల మంది ఓటర్లలో 27.44 లక్షల మంది మాత్రమే సక్రమమైన గుర్తింపు ఉందని, వీరినే తుది జాబితాలో చేర్చనున్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. వీటితో పాటు తల్లిదండ్రుల గుర్తింపు కార్డులు అడగడం, 2002 ఓటు తాలూకా ఆధారాలు అడగడం, నోటీసులు సరిగ్గా ఇవ్వకపోవడం, ఈసీ సూచించినవి కాకుండా ఇతర గుర్తింపు కార్డులు అడగడం వంటి కారణాలతో ఓటర్లు విచారణకు అనాసక్తి చూపుతున్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు.

మరి వీరందరికి ఓట్లు ఉన్నట్లా లేనట్లా..?

ఓటు హక్కు ఉంటేనే ఉపయోగించుకునే వారి సంఖ్య తగ్గుతోంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు గెలిచినా ప్రజలకు ఒరిగేమి లేదనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది. అందుకే గత ఎన్నికల్లో తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ వల్ల ఆ సంఖ్య మరింత పెరిగింది. అధికారులు ఇచ్చిన నోటీసులకు బదులు ఇవ్వాలంటే బీఎల్‌వోల చుట్టూ ఎవరు తిరుగుతారనే ఆలోచనతోనే చాలా మంది నోటీసులను సీరియస్‌గా తీసుకోలేదనే వాదన వినిపిస్తోంది. ఇంకా విడ్డూరం ఏమిటంటే.. చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీలు, మీడియా ప్రతినిధులకు కూడా ఈ నోటీసులు చేరడంతో ఇదంతా సరైన ప్రక్రియ కాదనే విమర్శలతో విచారణకు హాజరుకావడం లేదు. మరి వీరందరికి ఓటు వేసే హక్కు ఉంటుందా లేక ఎన్నికల కమిషన్ వేరే ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తుందో లేదో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed