The Paradise Movie Review: ‘ది ప్యారడైజ్’ మూవీ రివ్యూ… నాని బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

The Paradise Movie Review: 'ది ప్యారడైజ్' మూవీ రివ్యూ... నాని బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడా? | తెలుగు సినిమా వార్తలు


కథ?

హైదరాబాద్ జాగీర్‌లో ‘ప్యారడైజ్’ అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం మొత్తం శికంజి మాలిక్ అనే సంపన్న వర్గానికి చెందిన వ్యక్తి ఆధీనంలో ఉంటుంది. దాదాపు 200 ఏళ్లుగా మాలిక్ వంశీయుల ఆధిపత్యం కొనసాగుతుంటుంది. అధికారం, అహంకారం, ఆధిపత్యం.. ఇవే ఆ కుటుంబానికి ప్రతీకలుగా కనిపిస్తాయి. ఇదే ప్రాంతంలో ‘సవారీ’ అనే అణగారిన జాతికి చెందిన ప్రజలు నివసిస్తుంటారు. వారి తరఫున హక్కులు, గుర్తింపు కోసం పోరాడే మహిళ సమ్మక్క. శికంజి మాలిక్ ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ తన జాతికి ప్రత్యేక గుర్తింపు రావాలని ఆమె పోరాటం చేస్తుంటుంది. అయితే సవారీ జాతిపై ప్రభుత్వం కూడా తీవ్ర ఆంక్షలు విధిస్తుంది.

వాళ్లని దేశద్రోహులుగా పరిగణించే పరిస్థితులు ఏర్పడతాయి. సమ్మక్క కొడుకే జడల్. చిన్నతనం నుంచే తల్లిపై ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాడు. తన తల్లి నమ్మే సిద్ధాంతాలు, తన జాతి కోసం ఆమె చేస్తున్న పోరాటం.. ఇవేవీ జడల్‌కు నచ్చవు. తన తల్లి కలలు కనే జాతి గుర్తింపుకు అతడు పూర్తిగా భిన్నమైన ఆలోచనలతో పెరుగుతాడు.

అయితే పరిస్థితులు మారేకొద్దీ జడల్ జీవితంలో కీలకమైన మలుపు వస్తుంది. తన తల్లి మీద ఉన్న ద్వేషం వెనుక అసలు కారణం ఏంటి? సవారీ జాతి కోసం చివరకు జడల్ ఏం చేశాడు? అతడు తీసుకున్న నిర్ణయం మంచికోసమా.. చెడుకోసమా? ప్రభుత్వం వారిని ఎందుకు దేశద్రోహులుగా చూస్తుంది? అసలు జడల్ ప్రయాణం ఎక్కడికి దారితీసింది? అనేదే ‘ది ప్యారడైజ్’ కథ.

సినిమా ఎలా ఉంది?

సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే ‘ఏదో కొత్తగా చూపించబోతున్నారు’ అనే ఫీలింగ్ కలుగుతుంది. దానికి తగ్గట్టుగానే ప్రారంభ సన్నివేశాలు కూడా క్యూరియాసిటీ పెంచుతాయి. అయితే కథ ముందుకు వెళ్లే కొద్దీ ఆ ఆసక్తి అదే స్థాయిలో కొనసాగదు. చాలా సన్నివేశాలు కథను ముందుకు తీసుకెళ్లడం కంటే పాత్రలను, ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికే ఎక్కువ సమయం తీసుకున్నట్టు అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్‌లో సమ్మక్క నినాదంతో మొదలయ్యే ఎపిసోడ్ కథపై ఆసక్తిని పెంచుతుంది. జడల్ ఇంట్రడక్షన్ కూడా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఆకట్టుకునేలా ఉంటుంది. నాని ఎంట్రీతో సినిమాకు మంచి ఊపు వస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు ఒకదానితో ఒకటి సహజంగా కనెక్ట్ అవుతున్న ఫీలింగ్ ఇవ్వవు. కొన్ని సీన్స్ యాదృచ్ఛికంగా వచ్చినట్టుగా అనిపిస్తాయి.

సుబ్బు పాత్ర విషయానికి వస్తే.. కయాదు లోహర్ చేసిన ఈ క్యారెక్టర్‌లో పెద్దగా మెరుపులు కనిపించవు. చనిపోయిన తండ్రి పరువు కోసం అప్పు తీర్చడానికి బూతు సినిమాల్లో నటించడం అనే ట్రాక్‌ను దర్శకుడు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అదే అంశాన్ని ఎంటర్‌టైన్‌మెంట్ లేదా ఎమోషనల్ కోణంలో బలంగా చూపించి ఉంటే సుబ్బు పాత్రకు మరింత బలం వచ్చేది. ఇక విక్రమ్ మాలిక్ పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకోదు.

జడల్ తన తల్లి సమ్మక్కను ద్వేషించే సన్నివేశాల్లో కూడా కావాల్సిన ఎమోషనల్ ఇంపాక్ట్ పూర్తిగా కనిపించదు. సమ్మక్క తన శరీరాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితిని కూడా మరింత బలమైన కారణంతో, ఆమె పోరాట నాయకత్వానికి తగ్గట్టుగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే పాత్ర మరింత ప్రభావవంతంగా ఉండేది. ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం వేరే లెవల్ ఉంటది. అయితే సెకండ్ హాఫ్‌లో జడల్ తీసుకునే నిర్ణయంతో కథనం కొంత వేగం అందుకుంటుంది. కానీ ఆ తర్వాత కూడా రొటీన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకుడు కథతో పూర్తిగా జర్నీ అవ్వలేకపోతాడు.

సినిమాలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలినట్టుగా కనిపించే శంకర్ పాత్ర మాత్రం కొంత క్యూరియాసిటీని కలిగిస్తుంది. అలాగే ప్రభుత్వం ‘టాడా’ చట్టాన్ని ప్రయోగించి సవారీ జాతిని టెర్రరిస్టులుగా పరిగణించే అంశం కూడా ఆసక్తిని కలిగిస్తుంది. అయితే జాతి గుర్తింపు కోసం పోరాడుతున్న ప్రజలు ప్రభుత్వాన్ని ఆశ్రయించకుండా ఇంత తీవ్ర పరిస్థితులకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే ప్రశ్నకు కథ పూర్తిస్థాయిలో సమాధానం ఇవ్వలేకపోయింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా అంచనాలకు తగ్గ స్థాయిలో పెద్ద ఇంపాక్ట్ ఇవ్వవు.

నటీనటుల పర్ఫార్మెన్స్:

‘ది ప్యారడైజ్’లో అసలు సినిమాను నిలబెట్టేది నాని. జడల్ పాత్రలో ఆయన చూపించిన వేరియేషన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లుక్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు పూర్తిగా పాత్రలోకి వెళ్లిపోయాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో నాని పెర్ఫార్మెన్స్ మరో లెవల్‌లో ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకుడికి గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ పాత్రకు అవసరమైన తీవ్రతను బాగా చూపించాడు.

నట ప్రపూర్ణ మోహన్‌బాబు శికంజి మాలిక్ పాత్రలో మరోసారి తన మార్క్ చూపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు అదనపు బలంగా నిలుస్తుంది. సోనాలి కులకర్ణి సమ్మక్క పాత్రలో మెప్పించారు. ముఖ్యంగా పోరాట నాయకురాలిగా ఆమె పెర్ఫార్మెన్స్ బాగుంది. సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఇప్పటివరకు చూసిన కామెడీ ఇమేజ్‌కు భిన్నంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనలో మరో కోణాన్ని చూపించాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం:

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం విషయానికి వస్తే.. సినిమా విజువల్‌గా, కాన్సెప్ట్ పరంగా ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ, కథనాన్ని అదే స్థాయిలో నడిపించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. దర్శకుడిగా కొన్ని సన్నివేశాల్లో మెప్పించినా.. రచయితగా మాత్రం కథను మరింత బలంగా రాసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతంలో ‘ఏష నాగులు’తో పాటు మిగతా పాటలు కూడా ఆకట్టుకుంటాయి. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అంచనాలకు తగ్గ స్థాయిలో పేలలేదు. సుధాకర్ చెరుకూరి నిర్మాణ విలువలు మాత్రం చాలా రిచ్‌గా ఉన్నాయి. భారీ సెట్స్, విజువల్స్, నిర్మాణ స్థాయి సినిమాకు గ్రాండ్ లుక్ తీసుకొచ్చాయి.

బలాలు:

నాని నటన,

మోహన్‌బాబు స్క్రీన్ ప్రెజెన్స్,

సోనాలి కులకర్ణి పెర్ఫార్మెన్స్,

యాక్షన్ సన్నివేశాలు,

నిర్మాణ విలువలు.

బలహీనతలు:

కథనం,

దర్శకత్వం,

కొన్ని పాత్రల ఎస్టాబ్లిష్‌మెంట్,

రొటీన్ సన్నివేశాలు,

క్లైమాక్స్ ఇంపాక్ట్.

చివరిగా..:

‘ది ప్యారడైజ్’లో మంచి కాన్సెప్ట్, భారీ ప్రపంచం, బలమైన పాత్రలు ఉన్నప్పటికీ.. వాటిని కలిపి ఒక బలమైన కథనంగా మార్చడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. నాని మాత్రం జడల్ పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. మోహన్‌బాబు, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే కథనం, దర్శకత్వం విషయంలో మరింత బలం ఉండి ఉంటే సినిమా ఇంపాక్ట్ మరో స్థాయిలో ఉండేది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports