Last Updated:
అల్లరి నరేష్ హీరోగా వచ్సిన లేటెస్ట్ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీ వేదికపైకి వచ్చేసింది. మరి ఆ వివరాలు చూద్దామా.
కామెడీ కింగ్ అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన సోషియో ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం, ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీ బాట పట్టింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) వేదికగా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. వింటేజ్ అల్లరి నరేశ్ తరహా వినోదానికి కాస్త ఫాంటసీ జోడించి దర్శకుడు చంద్రమోహన్ చింతాడ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సురభి, రాశిసింగ్, విష్ణుప్రియ, ప్రిషాసింగ్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మంతెన సూర్యనారాయణ అలియాస్ సూరి (అల్లరి నరేశ్) కుటుంబం తరతరాలుగా ‘రంభ ఊర్వశి మేనక డ్రామా కంపెనీ’ని నడుపుతుంటుంది. వీరి వద్ద ఒక పురాతనమైన మ్యాజిక్ బుక్ ఉంటుంది. ఆ పుస్తకంపై ముగ్గు వేస్తే సాక్షాత్తూ దేవలోకం నుంచి రంభ, ఊర్వశి, మేనకలు దిగి వచ్చి కోరిన కోరికలన్నీ తీర్చేస్తారనేది వారి ప్రగాఢ నమ్మకం. అయితే, ఆ బుక్‌ను నమ్ముకున్న సూరి కుటుంబం అప్పుల ఊబిలోకి కూరుకుపోతుంది తప్ప పైనుంచి ఎవరూ దిగిరారు. మరోవైపు, చిన్నప్పటి నుంచి సినిమాల్లో హీరో కావాలని కలలు కనే సూరి, కష్టపడకుండా కేవలం ఆ మ్యాజిక్ బుక్ పేరు చెప్పి ఊరందరి వద్దా అప్పులు చేస్తుంటాడు.
అప్పుల బాధలు తీవ్రమవుతున్న తరుణంలో, సూరి తల్లి అనారోగ్యంతో మంచం పడుతుంది. ఆమె ప్రాణాలు కాపాడాలంటే వైద్యానికి రూ.లక్షలు అవసరం అవుతాయి. చేతిలో చిల్లిగవ్వ లేక, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న సూరి, చివరి ప్రయత్నంగా మరోసారి ఆ మేజిక్ బుక్‌పై ముగ్గు వేస్తాడు. అనూహ్యంగా ఆ పుస్తకం తెరుచుకుని, నిజంగానే రంభ, ఊర్వశి, మేనకలు భూలోకానికి దిగొస్తారు. ఆ తర్వాత సూరి కోరికలు నెరవేరాయా? అప్సరసల రాకతో చోటుచేసుకున్న పరిణామాలు ఏంటి? అనేది మిగతా కథ.
థియేటర్లలో ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయిన ఈ చిత్రం, ఫాంటసీ, కామెడీ అంశాలు మెండుగా ఉండటంతో ఓటీటీ ప్రేక్షకులను, ముఖ్యంగా ఫ్యామిలీ, కిడ్స్‌ను ఆకట్టుకునే అవకాశం ఉంది. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్, అప్సరసల ట్రాక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.














