Last Updated:
బుల్లితెర యాంకర్‌గా, నటిగా తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ భీమనేని.. తాజాగా తన ఆదాయ వనరులపై ఓపెన్ గా మాట్లాడారు.
బుల్లితెర యాంకర్‌గా, నటిగా తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ భీమనేని, డిజిటల్ స్పేస్‌లో అత్యంత పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలలో ఒకరు. తన గ్లామరస్ ఫోటోషూట్స్, డ్యాన్స్ రీల్స్‌తో నిత్యం నెటిజన్లను అలరించే ఆమె, తాజాగా తన ఆదాయ మార్గాలపై ఆసక్తికరమైన విషయాలను బహిర్గతం చేశారు. రీసెంట్ గా ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న విష్ణుప్రియ.. టెలివిజన్ షోలు, సినిమాల రెమ్యునరేషన్ కంటే సోషల్ మీడియా ద్వారానే తాను అత్యధికంగా సంపాదిస్తున్నట్లు కుండబద్దలు కొట్టారు.
ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ద్వారా విష్ణుప్రియ నెలకు భారీ స్థాయిలో ఆదాయం అర్జిస్తున్నారు. టెక్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సుమారు 4,728 మంది పెయిడ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. నెలకు ఒక సబ్స్క్రిప్షన్ కోసం ఫాలోవర్లు రూ.390 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే, కేవలం ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ల ద్వారానే నెలకు సుమారు రూ.18.43 లక్షల పైచిలుకు స్థిరమైన ఆదాయం ఆమెకు అందుతోందని స్పష్టమవుతోంది. ఇది కాకుండా, బ్రాండ్ ఎండార్స్మెంట్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్స్, పెయిడ్ పోస్టుల ద్వారా వచ్చే అదనపు రెమ్యునరేషన్ కూడా గణనీయంగా ఉంటుందని విష్ణుప్రియ తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “కేవలం నా విషయంలోనే కాకుండా, నేటి కాలంలో చాలా మంది సెలబ్రిటీలకు సోషల్ మీడియా అతిపెద్ద ఆదాయ వనరుగా మారింది. టీవీలో రెండు ఎపిసోడ్లు లేదా షోలు చేస్తే వచ్చే పారితోషికం కంటే, సోషల్ మీడియాలో ఒక్క బ్రాండ్ ప్రమోషన్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఆదాయమే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మనం పెట్టే శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రతిభావంతులు సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటారు. కానీ, నా అదృష్టం కొద్దీ నాకు ప్రతిరోజూ కొత్త ప్రాజెక్టుల కోసం ఆఫర్స్ వస్తూనే ఉంటాయి” అని ఆనందం వ్యక్తం చేశారు.
ఇక విష్ణుప్రియ కీలక పాత్రలో నటిస్తున్న ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. కామెడీ కింగ్ అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ను దర్శకుడు చంద్రమోహన్ చింతాడ తెరకెక్కించారు. ఈ చిత్రంలో సురభి మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా, రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో అల్లరి నరేశ్‌తో కలిసి విష్ణుప్రియ వేసిన స్టెప్పులు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.














