Last Updated:
ఇరాన్, అమెరికా యుద్ధంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ సైనిక విభాగం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’తీవ్రంగా ఖండించింది. ఇదంతా కేవలం అమెరికా అంతర్గత రాజకీయాల కోసం ట్రంప్ ఆడుతున్న డ్రామా అని కొట్టిపారేసింది.
US-Iran War: అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు సంబంధించి ఒక భారీ పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్‌లతో పాటు పలు మధ్యప్రాచ్య దేశాల మధ్య శాంతికి సంబంధించిన ఒక చారిత్రాత్మక ఒప్పందం దాదాపుగా ఖరారైందని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. అయితే, ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇరాన్ సైనిక విభాగం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’తీవ్రంగా ఖండించింది. ఇదంతా కేవలం అమెరికా అంతర్గత రాజకీయాల కోసం ట్రంప్ ఆడుతున్న డ్రామా అని కొట్టిపారేసింది.
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను పెట్టారు. వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్ నుండి తాను సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, బహ్రెయిన్ దేశాల అధినేతలతో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు. “శాంతికి సంబంధించిన అవగాహన ఒప్పందం” పై తామంతా చర్చించామని పేర్కొన్నారు.

అమెరికా, ఇరాన్‌లతో పాటు మిగిలిన భాగస్వామ్య దేశాల మధ్య ఈ శాంతి ఒప్పందం ముగింపు దశకు చేరుకుందని ట్రంప్ స్పష్టం చేశారు. “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, ఇతర దేశాల మధ్య ఈ ఒప్పందం చాలా వరకు ఖరారైంది. చివరి అంచె అంశాలు మరికొన్ని వివరాలపై చర్చలు జరుగుతున్నాయి, వీటిని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం” అని ట్రంప్ రాసుకొచ్చారు. దీనితో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కూడా తాను విడిగా మాట్లాడానని ఆ చర్చలు కూడా చాలా బాగా సాగాయని ఆయన క్లెయిమ్ చేశారు.
ఈ ఒప్పందం ద్వారా రాబోయే ప్రధాన ఫలితాలలో ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) ని మళ్లీ తెరవడం ఒకటని ట్రంప్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను కుదిపేస్తూ, గత కొన్ని నెలలుగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన అత్యంత కీలకమైన గ్లోబల్ షిప్పింగ్ రూట్ ఇది కావడం గమనార్హం.
ట్రంప్ చేసిన ఈ ప్రకటనను ఇరాన్ ప్రభుత్వం వెంటనే తప్పుపట్టింది. అల్ జజీరా నివేదిక ప్రకారం.. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘ఫార్స్’ ఐఆర్‌జీసీని ఉటంకిస్తూ ట్రంప్ పోస్ట్‌పై స్పందించింది. ట్రంప్ చేసిన తాజా సామాజిక మాధ్యమ పోస్ట్ కేవలం అమెరికా దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశించినదే తప్ప, ప్రస్తుతం జరుగుతున్న చర్చల వాస్తవ పరిస్థితులకు అది అద్దం పట్టడం లేదని స్పష్టం చేసింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













