Last Updated:
తిరుమలలో రద్దీని ఆసరాగా చేసుకుని భక్తుడి జేబులో నగదు, సెల్ఫోన్ చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి నగదు, రెండు సెల్ఫోన్లతో పాటు నకిలీ టీటీడీ ఉద్యోగి, ఎయిర్పోర్ట్ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిక్పాకెట్కు పాల్పడిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన మురుగన్ నాగరాజ్ @ శంకరరావు (52)ను పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 24న రాంబగీచా సర్కిల్ వద్ద టీటీడీ ఉచిత బస్సులో రద్దీని ఆసరాగా చేసుకుని భక్తుడి జేబులో నుంచి నగదు, సెల్ఫోన్ దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద నుంచి రూ.1,000 నగదు, రెండు ఆండ్రాయిడ్ సెల్ఫోన్లు, నకిలీ టీటీడీ ఉద్యోగి గుర్తింపు కార్డు, నకిలీ కీసిక్/చెన్నై ఎయిర్పోర్ట్ ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భక్తులను మోసం చేయడంతో పాటు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేందుకు నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడికి గతంలో ‘మాంగళ్య పూజ’ పేరుతో భక్తులను మోసం చేసిన నేర చరిత్ర కూడా ఉన్నట్లు తెలిపారు. పక్కా సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న సొత్తుతో కోర్టులో హాజరుపరచగా 15 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. నిందితుడి గత నేర చరిత్రతో పాటు నకిలీ గుర్తింపు కార్డుల వినియోగం, ఇతర నేరాలతో ఉన్న సంబంధాలపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
భక్తులు నకిలీ ఉద్యోగాలు, ఇతర మోసపూరిత హామీలతో నమ్మించే వ్యక్తులు లేదా దళారులను నమ్మి మోసపోవద్దని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐ.పి.ఎస్. సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా మోసాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి తెలియజేయాలని, అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని కోరారు.














