Last Updated:
Ghaziabad Tragedy: అటు చదువులో చురుగ్గా ఉంటూనే, ఇటు క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ దేశస్థాయిలో పతకాలు సాధించిన ఓ వర్ధమాన క్రీడాకారిణి అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
గాజియాబాద్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనం 12వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి 14 ఏళ్ల జాతీయ రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్ మృతిచెందింది. భవిష్యత్తులో దేశం గర్వించే స్థాయికి చేరుకుంటుందనుకున్న బాలిక ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలోనే కాకుండా స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గాజియాబాద్‌కు చెందిన ప్రాచి (14) అనే బాలిక స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచే క్రీడల పట్ల ఎంతో ఆసక్తి కనబరిచిన ఆమె, రోప్ స్కిప్పింగ్‌ను ఎంచుకుని తీవ్ర సాధన చేసింది. ఆమె ప్రతిభకు తగ్గట్టే ఇటీవల మహారాష్ట్రలో సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు ఘనంగా నిర్వహించిన ‘సీబీఎస్ఈ నేషనల్ గర్ల్స్ రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్షిప్-2026’ పోటీల్లో పాల్గొంది. ఆ జాతీయ స్థాయి పోటీల్లో ప్రాచి అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఏకంగా రెండు బంగారు పతకాలను ముద్దాడింది. తన విజయంతో తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తెచ్చి ఇటీవలే ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగివచ్చింది. కూతురి విజయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు వేడుకగా జరుపుకుంటున్న సమయంలో ఈ ఘోరం జరిగింది.
శుక్రవారం రాత్రి వేళ ప్రాచి తన ఇంట్లోని 12వ అంతస్తు బాల్కనీలో ఆరేసిన దుస్తులను లోపలికి తెచ్చేందుకు వెళ్లింది. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ ఆమె బ్యాలెన్స్ తప్పి బాల్కనీ రెయిలింగ్ పైనుంచి నేరుగా కింద పడిపోయింది. కింద భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ప్రాచి తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న బాలికను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో కుటుంబసభ్యులంతా ఇంట్లోనే ఉన్నారని తెలుస్తోంది. ఈ విషాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ప్రాచి ప్రమాదవశాత్తూ కిందపడిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం అపార్ట్మెంట్ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. పతకాలతో తిరిగి వచ్చి కొన్ని రోజులకే చిన్నారి మృత్యువాత పడటంతో తోటి విద్యార్థులు, క్రీడా వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.














