Last Updated:
ఐపీఎల్ 2026 ఫైనల్ వేదిక అనూహ్యంగా మారింది. బెంగళూరులో జరగాల్సిన ఈ టైటిల్ పోరును మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి బీసీసీఐ మార్చింది. స్థానిక రాజకీయ నేతలు ఉచిత వీఐపీ టికెట్లు డిమాండ్ చేయడమే ఈ మార్పునకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను బోర్డు అధికారికంగా ప్రకటించింది.
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వేదిక అధికారికంగా ఖరారైంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన టైటిల్ పోరును బీసీసీఐ అనూహ్యంగా అహ్మదాబాద్‌కు మార్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా పేరొందిన నరేంద్ర మోదీ స్టేడియం మే 31న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వాస్తవానికి ప్రతి ఏడాదీ గతేడాది విజేతగా నిలిచిన జట్టు సొంత మైదానంలో ఫైనల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టారు. స్థానిక క్రికెట్ అసోసియేషన్, అధికారుల నుంచి వచ్చిన కొన్ని డిమాండ్లు తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఆ కారణం వల్లే ఫైనల్ వేదికను అహ్మదాబాద్‌కు మార్చామని బీసీసీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా వెల్లడించారు. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను బోర్డు బుధవారం విడుదల చేసింది. గత ఐదేళ్లలో అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగడం ఇది నాలుగోసారి కావడం విశేషం. మే 26 నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.
వేదిక మార్పుపై బీసీసీఐ చేసిన ప్రకటనలో నిబంధనలకు విరుద్ధమైన డిమాండ్ల గురించి ప్రస్తావించారే తప్ప, అసలు కారణం ఏమిటో నేరుగా చెప్పలేదు. అయితే పలు నివేదికల ప్రకారం చూస్తే, స్థానిక రాజకీయ నాయకుల నుంచి వచ్చిన అసాధారణ డిమాండ్ల వల్లే ఈ మార్పు జరిగినట్లు స్పష్టమవుతోంది. ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌కు ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయనంద్ కాశప్పనవర్ బహిరంగంగానే వీఐపీ పాస్‌ల డిమాండ్ తెరపైకి తెచ్చారు.
ప్రజాప్రతినిధులమైన తాము క్యూలో నిలబడలేమని, ప్రతి ఎమ్మెల్యేకు కనీసం ఐదు ఐపీఎల్ టికెట్లు ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. ఆ తర్వాత వెంటనే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం ఎంపీలు, ఎమ్మెల్యేలకు మ్యాచ్‌కు మూడు ఉచిత టికెట్ల చొప్పున కేటాయిస్తామని వెల్లడించారు. బీసీసీఐ ఈ వ్యవహారంపై నేరుగా స్పందించనప్పటికీ, వేదికను మార్చడం వెనుక ఉన్న అసలు కారణం ఇదేనని క్రీడా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని ఎంచుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. అత్యధిక సీటింగ్ సామర్థ్యం ఉన్న ఈ మైదానం ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక మ్యాచ్‌లకు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ అత్యుత్తమ మౌలిక సదుపాయాలు ఉండటంతో పాటు, బయటి వ్యక్తుల నుంచి అనవసరమైన ఒత్తిళ్లు తక్కువగా ఉంటాయి. భారీ అంచనాలు ఉండే ఫైనల్ లాంటి మ్యాచ్‌ను సురక్షితమైన, నియంత్రిత వాతావరణంలో నిర్వహించడానికి బీసీసీఐకి ఇది సరైన వేదికగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే, ఈ వేదిక మార్పు కేవలం సౌలభ్యం కోసమే కాకుండా, నిర్వహణపై తమకు పూర్తి పట్టు ఉండేలా బోర్డు తీసుకున్న జాగ్రత్తగా పరిగణించవచ్చు.
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్ ఈ విధంగా ఉంది. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మే 26న ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత మే 27న న్యూ చండీగఢ్‌లోని న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడతాయి. అదే మైదానంలో మే 29న క్వాలిఫయర్-2 జరగనుంది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు ఈ మ్యాచ్‌లో ఫైనల్ బెర్త్ కోసం పోటీపడతాయి.
ఇక విజేతను నిర్ణయించే గ్రాండ్ ఫైనల్ మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అట్టహాసంగా జరగనుంది. ఈ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను మూడు వేర్వేరు నగరాల్లో నిర్వహించడం ఈ సీజన్లో తీసుకున్న ప్రత్యేక నిర్ణయమని, బెంగళూరు వ్యవహారం వల్లే ఈ రకమైన మార్పులు చేయాల్సి వచ్చిందని బోర్డు వివరించింది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













