Last Updated:
PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ‘జపాన్ ఓపెన్’ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది.
ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, జపాన్‌కు చెందిన అకానె యమగుచిపై సింధు ఘనవిజయం సాధించారు. 50 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో 21-17, 21-17 తేడాతో వరుస గేముల్లో యమగుచిని ఓడించి సింధు ఛాంపియన్‌గా నిలిచారు.
బిడబ్ల్యూఎఫ్ (BWF) వరల్డ్ టూర్‌లో సింధు ఒక మేజర్ టైటిల్‌ను గెలుచుకుని దాదాపు ఏడేళ్లు అవుతోంది. చివరగా ఆమె ఆగస్టు 2019లో బాసెల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సూపర్ 750 లేదా అంతకంటే పెద్ద టైటిల్‌ను గెలుచుకున్నారు. ఆ తర్వాత 2022లో కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించినప్పటికీ, ఎడమకాలి మడమ గాయం కారణంగా ఆమె ఫామ్ దెబ్బతింది. తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న సింధు, ఈ విజయంతో తాను ఇంకా ముగిసిపోలేదని, మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకున్నానని ప్రపంచానికి నిరూపించారు.
మ్యాచ్ చివరి దశలో స్కోరు 20-17 వద్ద ఉన్నప్పుడు యమగుచి కొట్టిన షాట్ లైన్ వెలుపల పడిందని లైన్ జడ్జి కాల్ ఇచ్చారు. దీనితో సింధు గెలిచినట్లు భావించారు, కానీ యమగుచి వెంటనే రివ్యూ కోరారు. ఆ 30 సెకన్ల రివ్యూ సమయం ఎంతో ఉత్కంఠగా సాగింది. చివరకు అంపైర్ నిర్ణయం సింధుకు అనుకూలంగా రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మైదానంలోనే మోకాళ్లపై కూర్చొని కోర్టును ముద్దాడి, చేతులు చాచి సంబరాలు చేసుకున్నారు. అనంతరం తన కోచ్ ఇర్వాన్స్య ఆది ప్రతామను ఆలింగనం చేసుకున్నారు.
2025లో ఇండోనేషియాకు చెందిన ప్రముఖ కోచ్ ఇర్వాన్స్య సింధు శిక్షణా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆమె ఆటతీరులో మార్పు వచ్చింది. సింధు తన పాత దూకుడును, అటాకింగ్ శైలిని మళ్లీ ప్రదర్శిస్తున్నారు. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఆమె ఈ ఏడాది మలేషియా ఓపెన్ సెమీఫైనల్, ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్స్ వరకు దూసుకెళ్లారు. వచ్చే నెలలో న్యూఢిల్లీలో జరగబోయే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు, అలాగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న తరుణంలో సింధు సాధించిన ఈ విజయం భారత క్రీడాకారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














