Last Updated:
కార్ బుక్ చేస్తే తిరుమలలో గది ఈజీగా ఇప్పిస్తామంటూ ప్రచారం..!
తిరుమలలో గదులు కావాలా..? కార్ బుక్ చేసుకోండి.. ఈజీగా రూమ్ ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో ఓ ట్రావెల్స్ సంస్థ చేస్తున్న ప్రచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయవాడ నుంచి తమ ట్రావెల్స్‌కు చెందిన కారును బుక్ చేసుకుంటే తిరుమలలో సులభంగా గదులు కేటాయించేలా చేస్తామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. కాసింబి షేక్ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చేసినట్లు చెబుతున్న ఈ ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అసలు తిరుమల గదుల కేటాయింపుపై ఇలాంటి ప్రచారాలు ఎలా జరుగుతున్నాయంటూ భక్తుల్లో చర్చ మొదలైంది.
తిరుమలలో వసతి విషయంలో టీటీడీ ఇప్పటికే పలుమార్లు భక్తులను అప్రమత్తం చేసింది. గదులు ఇప్పిస్తామని చెప్పే దళారులు, మధ్యవర్తులను నమ్మవద్దని సూచిస్తోంది. వారి మాటలు నమ్మి ముందుగా డబ్బులు చెల్లిస్తే మోసపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో కార్ బుకింగ్‌తో పాటు తిరుమలలో గదులు సులభంగా ఇప్పిస్తామంటూ జరుగుతున్న ప్రచారం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది.
సాధారణంగా తిరుమలలో వసతి, దర్శనం, ఇతర సేవలకు సంబంధించి అధికారిక విధానాల ప్రకారమే కేటాయింపులు జరుగుతాయి. అయితే కొందరు మధ్యవర్తులు భక్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని తమకు ప్రత్యేక పరిచయాలు ఉన్నాయని, సులభంగా గదులు ఇప్పించగలమని ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ ట్రావెల్స్ ప్రచారం కూడా ఇదే తరహాలో ఉందా అనే చర్చ జరుగుతోంది.
ఇలాంటి ప్రచారాలను నమ్మి డబ్బులు చెల్లించే ముందు భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుమలలో వసతి, దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన వివరాలను టీటీడీ అధికారిక వెబ్‌సైట్, అధికారిక విచారణ కేంద్రాల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు, దళారులు, మధ్యవర్తులు లేదా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పే మాటలను ఆధారంగా చేసుకుని డబ్బులు చెల్లించవద్దని సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే, వైరల్‌గా మారిన ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు. కార్ బుకింగ్ చేస్తే తిరుమలలో గదులు సులభంగా కేటాయిస్తామంటూ చేస్తున్న ప్రచారం నిజంగా ఏ విధంగా జరుగుతోంది..? దీని వెనుక ఎవరున్నారు..? అనే అంశాలపై అధికారులు పరిశీలన చేసి, భక్తులను తప్పుదోవ పట్టించే ప్రచారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.














