Last Updated:
Deepti Reddy: మహిళా సాధికారతే లక్ష్యంగా కృషి చేస్తూ ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచిన యువ పారిశ్రామికవేత్త శ్రీమతి మడుగుల దీప్తి రెడ్డి మరణం తర్వాత కూడా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపి అమరురాలయ్యారు.
అకాల మరణం అంచున బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ, ఆమె కుటుంబ సభ్యులు తీసుకున్న మహోన్నత నిర్ణయం సమాజానికి దిక్సూచిగా నిలిచింది. ఈ విషయాన్ని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. శ్రీమతి మడుగుల దీప్తి రెడ్డి మహిళల్లో వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడం, వారిని స్వావలంబన దిశగా నడిపించడమే లక్ష్యంగా ‘ఉమెనర్జీ’ (Womenergy), ‘వి ఎయిమ్’ (We Aim) వంటి సంస్థలను స్థాపించారు. ఎంతోమంది యువతులకు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు మార్గదర్శనం చేస్తూ సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే, విధి వంచించడంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
తన అర్ధాంగి ఇక లేరనే నిజాన్ని జీర్ణించుకోలేని పుట్టెడు దుఃఖంలోనూ ఆమె భర్త శ్రీ ప్రదీప్ రెడ్డి అత్యంత ఔదార్యాన్ని ప్రదర్శించారు. మరణం తర్వాత కూడా దీప్తి రెడ్డి జ్ఞాపకాలు సజీవంగా ఉండాలనే ఉద్దేశంతో అవయవదానానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వైద్యుల సహకారంతో ఆమె గుండె, కాలేయం, రెండు కిడ్నీలను అవయవదానం చేశారు. ఈ నిర్ణయంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నలుగురు బాధితులకు అవయవ మార్పిడి జరిగి, వారి జీవితాల్లో సరికొత్త ఆశలు చిగురించాయి.
భౌతికంగా దీప్తి రెడ్డి మన మధ్య లేకపోయినా, నలుగురి ప్రాణాల రూపంలో ఆమె ఎప్పటికీ సజీవంగా ఉంటారని సన్నిహితులు, ప్రముఖులు కొనియాడారు. తీవ్ర శోకంలోనూ మానవత్వాన్ని చాటిన ఆమె భర్త ప్రదీప్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. మరణం తర్వాత కూడా నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చని ఈ ఘటన నిరూపించింది. ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన పెంచుకుని, ఇలాంటి గొప్ప సేవాకార్యానికి ముందుకు రావాల్సిన ఆవశ్యకతను ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది.














