Last Updated:
యువతకు భారత నౌకాదళం నుంచి కీలక అవకాశం వచ్చింది. 12వ తరగతి అర్హతతో పాటు నిర్దిష్ట క్రీడా అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు ఎంత ఉండాలి? దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు? పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న జాతీయ స్థాయి క్రీడాకారులకు భారత నౌకాదళం మంచి అవకాశం కల్పిస్తోంది. స్పోర్ట్స్ కోటా ఎంట్రీ 02/2026 బ్యాచ్‌లో భాగంగా సెలర్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలను సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రచురించే ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో అందుబాటులో ఉంచారు. నిర్దిష్ట క్రీడా విభాగాల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సాధారణ ప్రాంతాల్లోని అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబర్ 15లోపు తమ దరఖాస్తులను సమర్పించాలి. అయితే నార్త్ ఈస్ట్ ప్రాంతాలు, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్, మినికాయ్ దీవులకు చెందిన అభ్యర్థులకు అదనపు గడువు ఇచ్చారు. ఈ ప్రాంతాల అభ్యర్థులు అక్టోబర్ 22, 2026 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు ఫారమ్‌ను భారత నౌకాదళ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ద్వారా పొందవచ్చు.
స్పోర్ట్స్ కోటా సెలర్ నియామకంలో డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్, చీఫ్ పెట్టీ ఆఫీసర్ సహా పలు స్థాయిల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అవివాహితులై ఉండాలి. విద్యార్హత విషయానికి వస్తే 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి. దీనితో పాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న క్రీడలకు సంబంధించిన నిర్దిష్ట అర్హతలను కూడా కలిగి ఉండాలి. ముఖ్యంగా జూనియర్ లేదా సీనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న క్రీడాకారులకు ఈ నియామకంలో అవకాశం ఉంది.
భారత నౌకాదళ సెలర్ స్పోర్ట్స్ కోటా పోస్టులకు కనీస వయసు 17 సంవత్సరాల 6 నెలలుగా నిర్ణయించారు. గరిష్ఠ వయసు 25 సంవత్సరాలు. అభ్యర్థులు తమ వయసు, విద్యార్హత, క్రీడా అర్హతలకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ ప్రకారం పరిశీలించుకుని దరఖాస్తు చేయాలి.
అర్హత కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నిర్ణీత నమూనాలో దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు చేసే ముందు స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అర్హతలు, వయసు నిబంధనలు, ఇతర షరతులను నోటిఫికేషన్‌లో పూర్తిగా పరిశీలించడం అవసరం.
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.14,600 స్టైపెండ్ అందుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత పోస్టును బట్టి పే లెవల్ 5 లేదా 6 ప్రకారం జీతం చెల్లిస్తారు. ఈ జీతం సుమారు రూ.29,200 నుంచి ప్రారంభమవుతుంది. జాతీయ స్థాయి క్రీడాకారులకు క్రీడా ప్రతిభతోనే భారత నౌకాదళంలో ఉద్యోగం పొందేందుకు ఈ నియామకం అవకాశం కల్పిస్తోంది.














