Last Updated:
బిగ్‌బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అపూర్వ.. వచ్చిన మూడు నాలుగు రోజులకే ఎంత హడావుడి చేయాలో అంతా చేస్తోంది. ఈమెకు తగ్గట్లే షాలిని కూడా రెచ్చిపోతోంది. ఇంతకీ బిగ్‌బాస్ హౌస్‌లో 22వ రోజు ఎపిసోడ్లో అసలేం జరిగింది?
బిగ్‌బాస్ సీజన్ 10 రోజురోజుకూ అనూహ్య మలుపులతో, వేడెక్కించే వివాదాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. సాధారణంగా హౌస్‌లో సెలబ్రిటీల హవా నడుస్తుంటుంది, కానీ ఈ సీజన్లో మాత్రం కామనర్స్ కెమెరా స్పేస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపిస్తోంది. చిన్నచిన్న కారణాలకే గొడవలు పడుతూ, అరుస్తూ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన అపూర్వ.. వచ్చిన కొద్ది రోజుల్లోనే కెప్టెన్సీ దక్కించుకుని తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆమెకు దీటుగా షాలిని కూడా రెచ్చిపోతుండటంతో 22వ రోజు ఎపిసోడ్ హై-వోల్టేజ్ డ్రామాతో సాగింది.
వీకెండ్ ఎపిసోడ్ ముగిసిన తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అపూర్వ.. సోమవారం ఉదయాన్నే ముఖేష్‌తో వాగ్వాదానికి దిగింది. గిన్నెలు కడగడం, కెప్టెన్ గదిని శుభ్రం చేసి ఖాళీ చేయడం లాంటి పనులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. హౌస్‌లో ఒక మీటింగ్ పెట్టి, కచ్చితమైన రూల్స్ వివరిస్తే అప్పుడు తాను వాటిని పాటిస్తానని ముఖేష్ తేల్చి చెప్పాడు. వెంటనే అపూర్వ మీటింగ్ ఏర్పాటు చేసినా, అక్కడ కూడా ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. “కెప్టెన్ అంటే కనీస గౌరవం లేదా? నన్నెందుకు చులకనగా చూస్తున్నావ్?” అంటూ అపూర్వ లాజిక్ తీయగా, మధ్యలో జోక్యం చేసుకున్న త్రిగుణ్.. “నేను నిన్ను కెప్టెన్ అని పిలవను, ఏం చేసుకుంటావో చేసుకో” అంటూ సవాల్ విసరడంతో వాతావరణం మరింత వేడెక్కింది.
మరోవైపు, గత వారం ‘టెన్షన్-టెంప్టేషన్’ టాస్క్‌తో కంటెస్టెంట్లను ముప్పుతిప్పలు పెట్టిన బిగ్‌బాస్.. ఈ వారం ‘టోటల్ డామినేషన్’ అనే సరికొత్త ఆటను పరిచయం చేశాడు. ఇందులో హౌస్‌మేట్స్‌ను రెండు జట్లుగా విభజించారు. షాలిని, శృష్టి, చరణ్, నరేష్, త్రిగుణ్, ముఖేష్, దేబ్జానీలు ‘సప్తశక్తి’ (బ్లూ టీం) జట్టుగా ఏర్పడగా, మిగిలిన సభ్యులంతా ‘భైరవ’ (రెడ్ టీం) జట్టులో ఉన్నారు. ఒకరి వద్ద నుంచి మరొకరు డ్యాగర్స్ (కత్తులు) లాక్కోవడం, అలాగే ఇటుకలు సేకరించి మూడు దశల్లో రథాన్ని నిర్మించడం ఈ టాస్క్ ముఖ్య ఉద్దేశం. గేమ్ మొదలైన కాసేపటికే నరేష్ కత్తిని రాంప్రసాద్ ప్రాంక్ పేరుతో లాక్కోవడం వివాదానికి దారి తీసింది.
ఈ టాస్క్‌కు రోహిత్, షాలిని సంచాలకులుగా వ్యవహరిస్తూనే గేమ్ ఆడే అవకాశాన్ని బిగ్‌బాస్ కల్పించాడు. రూల్స్ గురించి వీరు చర్చిస్తుండగా అపూర్వ పదేపదే మధ్యలో జోక్యం చేసుకోవడంతో షాలిని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆట మధ్యలో శృష్టి కాలికి తీవ్ర గాయం కావడంతో ఆమెను మెడికల్ రూమ్‌కి పంపించారు. వెళ్లే ముందు శృష్టి తన కత్తిని షాలినికి ఇచ్చింది. ఇదే అదనుగా భావించిన అపూర్వ, తన టీం సభ్యులైన రోహిత్, సుధీర్, ఝాన్సీ, అమన్‌లను ఉసిగొల్పి షాలినిపై దాడి చేసి కత్తిని లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో రెండు జట్ల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. త్రిగుణ్, రోహిత్‌లు హద్దులు దాటి బూతులు మాట్లాడుకున్నారు. చివరికి అది శృష్టి కత్తి అని తెలియక తీసుకున్నామని అపూర్వ టీం కవర్ చేసే ప్రయత్నం చేసింది. చివరగా అమన్ ఫౌల్ గేమ్ ఆడాడని షాలిని ఆరోపించడంతో మరోసారి గొడవ జరిగింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఈ టాస్క్ మొదటి దశలో రెడ్ టీం (భైరవ) గెలిచి, రథానికి సంబంధించిన మొదటి భాగాన్ని అమర్చడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది.














