కథ:
కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఎస్సై కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంటాడు కళ్యాణ్ (దినేష్ తేజ్). ఎస్సై పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో పెళ్లి చూపుల కోసం రామాపురం గ్రామానికి వెళ్తాడు. అక్కడ సౌమ్య (దష్విక)ను చూసిన తొలి చూపులోనే ఆమె కళ్యాణ్‌కు నచ్చుతుంది.
అదే గ్రామంలో మూర్తి, నాగమణి అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటారు. వారికి సుధ అనే మానసిక సమస్యలతో బాధపడుతున్న కుమారుడు ఉంటాడు. అయితే అనూహ్యంగా మూర్తి, నాగమణి హత్యకు గురవుతారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగుతుంది. తల్లిదండ్రులను సుధనే హత్య చేశాడంటూ గ్రామస్థులు అతడిపై దాడి చేస్తారు.
ఈ ఘటన పోలీస్ స్టేషన్‌కు చేరడంతో కేసు దర్యాప్తు బాధ్యత కళ్యాణ్‌పై పడుతుంది. పెళ్లి చూపుల కోసం వచ్చిన కళ్యాణ్‌కు ఊహించని విధంగా ఒక హత్య కేసును ఛేదించే బాధ్యత ఎదురవుతుంది. దీంతో అతను గ్రామంలో జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా పరిశీలించడం మొదలుపెడతాడు.
అయితే దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ హత్య వెనుక అనేక అనుమానాలు, ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తుంటాయి. నిజంగానే సుధ తన తల్లిదండ్రులను హత్య చేశాడా? లేక ఈ కేసు వెనుక మరేదైనా కారణం ఉందా? కళ్యాణ్ దర్యాప్తులో ఎలాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి? ఈ కేసును ఛేదించే క్రమంలో కళ్యాణ్‌కు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు సౌమ్యతో అతడి పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
‘తత్వం’ కథను కేవలం ఓ హత్య కేసు చుట్టూ తిరిగే క్రైమ్ కథగా కాకుండా.. మనిషి ఆలోచన, నిజం, నమ్మకం, చైతన్యం వంటి అంశాలను ప్రశ్నించే విధంగా తెరకెక్కించే ప్రయత్నం కనిపిస్తుంది. ఒకవైపు హత్య కేసును ఛేదించే పోలీస్ దర్యాప్తు, మరోవైపు మనిషి అంతర్గత ఆలోచనలను ప్రశ్నించే తాత్విక అంశాలను కలిపి కథను నడిపించారు. సుధ పాత్ర ద్వారా ఒక వ్యక్తిని అతడి పరిస్థితులు, ప్రవర్తన ఆధారంగా వెంటనే నేరస్థుడిగా ముద్ర వేయడం ఎంతవరకు సరైనదనే ప్రశ్నను సినిమా ముందుకు తీసుకొస్తుంది. గ్రామస్థుల అనుమానం, పోలీసుల దర్యాప్తు, అసలు నిజాన్ని తెలుసుకునే కళ్యాణ్ ప్రయత్నం కథకు ప్రధాన బలంగా నిలుస్తాయి.
కళ్యాణ్ పాత్రలో దినేష్ తేజ్‌కు కథలో మంచి స్కోప్ లభించింది. సాధారణ కానిస్టేబుల్‌గా మొదలై క్లిష్టమైన కేసును ఛేదించే బాధ్యతను తీసుకునే పాత్రలో అతడి ప్రయాణం కథకు ఆసక్తిని తీసుకొస్తుంది. దష్విక పోషించిన సౌమ్య పాత్ర కథలో మరో కోణాన్ని చూపిస్తుంది. దర్శకుడు అర్జున్ కోలా క్రైమ్, మిస్టరీ, ఆధ్యాత్మికత, తాత్విక ఆలోచనలను ఒకే కథలో మిళితం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి కథల్లో కథనం వేగం, క్లైమాక్స్‌కు ముందు వచ్చే మలుపులు చాలా కీలకం. ప్రేక్షకులు ప్రతి సన్నివేశాన్ని శ్రద్ధగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కథను మాత్రం కాస్త ల్యాగ్ చేసి చూపించాడు దర్శకుడు.
నటీనటులు, టీమ్ పనితీరు:
కళ్యాణ్ పాత్రలో దినేష్ తేజ్ తన పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సౌమ్యగా దష్విక కనిపిస్తుంది. ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు అర్జున్ కోలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌కు ఆధ్యాత్మిక, తాత్విక అంశాలను జోడించే ప్రయత్నం చేశారు. కథలోని మిస్టరీని చివరి వరకు కొనసాగించడంపై దృష్టి పెట్టారు.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యం
ఆసక్తికరమైన మిస్టరీ
కొన్ని సన్నివేశాల వేగం నెమ్మదిగా ఉండటం
కథనం అందరికీ ఒకేలా కనెక్ట్ కాకపోవచ్చు
చివరగా:
క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో పాటు తాత్విక, ఆధ్యాత్మిక అంశాలను కలిపిన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘తత్వం’ ఆసక్తికరమైన అనుభూతిని అందించే ప్రయత్నం ఇది.
రేటింగ్ : 2.75













