Last Updated:
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీలో భారత జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా, అక్టోబర్ 10న జొహన్నెస్‌బర్గ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2027 మెగా టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్ వన్ వన్డే జట్టు భారత్ ఆడబోయే మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి అధికారికంగా ప్రకటించింది. కేప్‌టౌన్ వేదికగా గురువారం రాత్రి విడుదల చేసిన వివరాల ప్రకారం, టీమిండియా తన తొలి పోరులోనే ఆరుసార్లు ఛాంపియన్ అయిన బలమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్ 7న కేప్‌టౌన్ మైదానంలో ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలోనే, అంటే అక్టోబర్ 10న జొహన్నెస్‌బర్గ్‌లోని ప్రతిష్టాత్మక వాండరర్స్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ సమరం జరగనుంది. లీగ్ దశలోనే రెండు మాజీ ఛాంపియన్ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ క్రికెట్ ప్రపంచాన్ని ఎంతగానో ఊరిస్తోంది. అక్టోబర్ 2న ప్రారంభమయ్యే ఈ టోర్నీలో భారత్ గ్రూప్-ఎ లో పోటీ పడనుంది.
గ్రూప్-ఎ లో భాగంగా టీమిండియా మొత్తం ఐదు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లతో మ్యాచ్‌ల అనంతరం అక్టోబర్ 14న శ్వానే (Tshwane) లో ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ తలపడుతుంది. అక్టోబర్ 17న బ్లూమ్‌ఫోంటైన్ మైదానంలో క్వాలిఫైయర్-ఎ జట్టుతో, అక్టోబర్ 24న విక్టోరియా ఫాల్స్ వేదికగా ఆతిథ్య జింబాబ్వేతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
గ్రూప్-ఎ లో టాప్-3 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-7 దశకు అర్హత సాధిస్తాయి. ఈ రెండో రౌండ్ మ్యాచ్‌లు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 14 వరకు కొనసాగుతాయి. సూపర్-7 లో అత్యుత్తమ పాయింట్లు సాధించిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి.
మొదటి సెమీఫైనల్ నవంబర్ 17న కేప్‌టౌన్‌లో, రెండో సెమీఫైనల్ నవంబర్ 18న శ్వానేలో జరుగుతాయి. ప్రపంచకప్ విజేతను తేల్చే గ్రాండ్ ఫైనల్ నవంబర్ 21న జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ మైదానంలో జరగనుంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇదే వేదికపై పాక్‌ను ఓడించి భారత్ చరిత్ర సృష్టించగా, మళ్లీ ఇక్కడే టైటిల్ వేట సాగించేందుకు టీమిండియా సమాయత్తమవుతోంది.














