Last Updated:
కార్తీక్ సుబ్బరాజ్ కీర్తి సురేష్, రిషికాంత్, సనంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా ప్రయోగాత్మక చిత్రం ‘డోరతీ’ (Dorothy). అక్టోబర్ 2 న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
వైవిధ్యమైన కథలు, రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. ఆయన దర్శకత్వంలో కీర్తి సురేష్, రిషికాంత్, సనంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా ప్రయోగాత్మక చిత్రం ‘డోరతీ’ (Dorothy). ఇప్పటికే తమిళనాట విడుదలై, తన బోల్డ్ కంటెంట్ తో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమాజంలో ఎప్పుడూ సున్నితంగా ఉండే లింగ వివక్ష, ఎల్‌జీబీటీక్యూ+ (LGBTQ+) కమ్యూనిటీ వేదనను కళ్లకు కట్టే ప్రయత్నంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.
కథ 1995 కాలంలో సాగుతుంది. స్కూల్ రోజుల్లో అందరికీ భయపడే కార్తి (రిషికాంత్), తోటి విద్యార్థులను ఎదిరించే ధైర్యమున్న సుబ్బు (సనంత్) ప్రాణ స్నేహితులు. సుబ్బు తండ్రి విజిల్ వీరయ్య (ముత్తు కుమార్), అతని అన్నలు పరువు, కుల పిచ్చితో రగిలిపోయే మనస్తత్వం ఉన్నవారు. చిన్నప్పుడే తల్లి, అక్క ఆత్మహత్య చేసుకోవడంతో సుబ్బు తన తండ్రి, అన్నల మధ్యే పెరుగుతాడు. అయితే వయసు పెరిగే కొద్దీ స్నేహితుడు కార్తి మొరటు రౌడీలా మారితే, సుబ్బు మాత్రం దానికి భిన్నంగా మెతకగా, సున్నితంగా మారిపోతాడు. ఈ క్రమంలో వీరయ్య ఇంట్లోకి డోరతి (కీర్తి సురేష్) అడుగుపెడుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? కులం, పరువు కోసం కన్న కొడుకునే చంపాలనుకునే తండ్రి నుంచి సుబ్బు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? చివరికి ఈ ఇద్దరు స్నేహితుల ప్రయాణం ఏ తీరానికి చేరిందనేది మిగతా కథ.
ఇటీవల కాలంలో భారతీయ సినిమాలో ఎల్‌జీబీటీక్యూ+ సమస్యలపై సినిమాలు రావడం చూస్తున్నాం. అయితే, ఈ కథను 1995 నాటి గ్రామీణ, పరువు ప్రాణంగా భావించే నేపథ్యానికి ముడిపెట్టి చెప్పడం కార్తీక్ సుబ్బరాజ్ చేసిన సాహసం. కమర్షియల్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న కీర్తి సురేష్.. మహానటి, దసరా లాంటి చిత్రాల తర్వాత తన పాత్ర నిడివి కంటే కంటెంట్‌కు ప్రాధాన్యత ఉన్న ఇలాంటి చిత్రంలో నటించడం విశేషం. దర్శకుడు తన కథను లీనియర్ గా కాకుండా, బ్యాక్ అండ్ ఫోర్త్ (ముందుకు, వెనక్కు) స్క్రీన్ ప్లేతో నడిపించాడు. సుబ్బుని చంపేశానని కార్తి చెప్పే సీన్‌తో సినిమాను ప్రారంభించి ఆసక్తిని రేకెత్తించాడు.
ఫస్టాఫ్ అంతా 1990ల నాటి పరిస్థితులను, వారి స్నేహాన్ని స్థాపిస్తూ సాగుతుంది. ద్వితీయార్ధం పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. సమాజం, కుటుంబం నుంచి ఆ వర్గం వారు ఎదుర్కొనే చీత్కారాలను దర్శకుడు హృదయవిదారకంగా చూపించాడు. అయితే, కీర్తి సురేష్ పాత్రను కూడా అర్ధాంతరంగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ సినిమాకు ప్రధాన బలం. క్లైమాక్స్ అయితే అందరికీ బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది.
నటీనటుల విషయానికి వస్తే.. సుబ్బు పాత్రలో సనంత్ నటన అద్భుతం. సినిమాలో అతని వేరియేషన్స్ హైలైట్ గా నిలుస్తాయి. ఈ సినిమాకు సనంత్ నటన ప్రధాన బలం. రిషికాంత్ తన భావోద్వేగ నటనతో కంటతడి పెట్టిస్తాడు. కీర్తి సురేష్ ది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో తన మార్క్ చూపించింది. ముత్తుకుమార్ నటన పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా ఉంది. 1990ల నాటి వాతావరణాన్ని ఆర్ట్, క్యాస్టూమ్స్ విభాగం పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేశాయి.
ఓవరాల్ గా చూస్తే.. ‘డోరతీ’ రెగ్యులర్ కమర్షియల్ మసాలా సినిమా కాదు కానీ, ఎమోషనల్ సినిమాలను ఇష్టపడే వారికి బెటర్ చాయిస్.
రేటింగ్: 2.5














