Last Updated:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహుమతిగా వచ్చిన జ్ఞాపికల ఈ-వేలం గడువును కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అక్టోబర్ 31 వరకు పొడిగించింది. ఈ వేలం ద్వారా సమకూరే నిధులను పవిత్ర గంగా నది ప్రక్షాళన ప్రాజెక్టుకు వెచ్చిస్తారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాలలో దేశ విదేశీ ప్రముఖులు, ప్రజలు బహూకరించిన ప్రత్యేక జ్ఞాపికల ఈ-వేలం గడువును కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పొడిగించింది. సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ ఆరో విడత ఈ-వేలం వాస్తవానికి అక్టోబర్ 2వ తేదీతో ముగియాల్సి ఉండగా, ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన దృష్ట్యా అక్టోబర్ 31 వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేలంలో సుమారు 600కు పైగా అత్యంత అరుదైన, ఆకర్షణీయమైన వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆధ్యాత్మిక కళాఖండాలు, రామాలయం నమూనాలు, పారాలింపియన్లు అందించిన క్రీడా సామాగ్రి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేశ సంస్కృతిని ప్రతిబింబించే ఈ వస్తువులను సొంతం చేసుకునేందుకు ప్రజలు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు.
ఈ విడతలో 50 ప్రముఖ వస్తువులను ప్రత్యేక కేటగిరీ కింద ఎంపిక చేశారు. జగన్నాథ రథయాత్ర నమూనా, బంగారు పూతతో కూడిన రాధాకృష్ణుల చిత్రపటం, విభిన్న గిరిజన కళాఖండాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటి ప్రారంభ ధర రూ. 5.40 లక్షల నుంచి రూ. 13.50 లక్షల వరకు నిర్ణయించారు.
A Collection of India’s Finest Stories!
Explore a curated collection of 1500+ unique mementos gifted to Hon’ble Prime Minister Shri @narendramodi, each reflecting the cultural richness of India.
Discover the collection from 17 September to 2 October 2026 and bid for a piece of… pic.twitter.com/xsCFw427Rs
— Ministry of Culture (@MinOfCultureGoI) September 30, 2026
ఈ జ్ఞాపికలను సొంతం చేసుకోవాలనుకునే వారు నేరుగా అధికారిక పోర్టల్ pmmementos.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ ముందుగా మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఆధార్ ధ్రువీకరణ ద్వారా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వాలి. పోర్టల్‌లో అందుబాటులో ఉన్న వందలాది బహుమతుల జాబితా నుంచి మీకు నచ్చిన వస్తువును ఎంచుకోవచ్చు. అక్కడ నిర్ణయించిన ప్రారంభ బేస్ ప్రైస్ ఆధారంగా మీ బిడ్ మొత్తాన్ని నమోదు చేయాలి. నిర్దేశిత గడువు ముగిసే సమయానికి ఎవరైతే అత్యధిక ధరకు బిడ్ వేస్తారో వారికే ఆ వస్తువు దక్కుతుంది. ఆన్‌లైన్ పేమెంట్ పూర్తి చేసిన తర్వాత సదరు జ్ఞాపికను కొరియర్ ద్వారా నేరుగా మీ ఇంటి చిరునామాకే పంపిస్తారు.
ఆధార్ ధృవీకరణ ద్వారా పౌరులు ఎవరైనా ఈ వేలంలో పారదర్శకంగా పాల్గొనవచ్చు. ఈ వినూత్న కార్యక్రమం కేవలం ఒక సాధారణ వేలం మాత్రమే కాకుండా, దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రజల ముంగిటకు తెచ్చే గొప్ప ప్రయత్నంగా ప్రభుత్వం అభివర్ణించింది.
ఈ-వేలం ద్వారా సమకూరే మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు మళ్లించనున్నారు. పవిత్ర గంగా నది పునరుజ్జీవనం, కాలుష్య నివారణ చర్యల కోసమే ఈ నిధులను నేరుగా వినియోగిస్తారు. గత విడతల్లోనూ వేల సంఖ్యలో వస్తువులు అమ్ముడై కోట్ల రూపాయల నిధులు గంగా పరిరక్షణకు సమకూరాయి.














