Weapon Smuggling: ఆర్మీలో చేరిందే స్మగ్లింగ్ కోసం.. బంగ్లాదేశ్ డీలర్‌తో బేరం! ఆయుధాల చోరీలో షాకింగ్ నిజాలు | | ACTPnews

Weapon Smuggling: ఆర్మీలో చేరిందే స్మగ్లింగ్ కోసం.. బంగ్లాదేశ్ డీలర్‌తో బేరం! ఆయుధాల చోరీలో షాకింగ్ నిజాలు |


నేర చరిత్ర.. సైన్యంలోకి ప్రవేశం

నాగర్‌కర్నూల్ జిల్లా ఉడుమెల్లి గ్రామానికి చెందిన మల్లేశ్, 2010లో సైన్యంలో చేరడానికి ముందే నేర బాట పట్టాడు. 2007 ప్రాంతంలో అమ్రాబాద్, అచ్చంపేట పరిసరాల్లో జరిగిన పలు ఇళ్ల చోరీల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. అయితే, తనపై నమోదైన పోలీసు కేసుల వివరాలను అధికారుల దృష్టికి రాకుండా గోప్యంగా ఉంచి ఆర్మీలోకి ప్రవేశించాడు. సైన్యంలో చేరిన తర్వాత ఏ కంటోన్మెంట్‌లో పోస్టింగ్ లభించినా, అతడు ప్రధానంగా ఆయుధాగారాల వద్దనే విధులు పొందేలా జాగ్రత్తపడేవాడు.

విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం, ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించడం వంటి కారణాలతో అతడు పలుమార్లు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నాడు. 2022లో కోల్‌కతా సమీపంలోని బారక్‌పూర్ కంటోన్మెంట్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ ఉన్నతాధికారితో దురుసుగా ప్రవర్తించడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు.

స్మగ్లర్లతో సంబంధాలు.. బంగ్లాదేశ్ డీలర్‌తో ఒప్పందం

బారక్‌పూర్ యూనిట్ పరిసరాల్లోని చెరకు రసం దుకాణదారుడైన బీర్బల్ షాతో ఏర్పడిన పరిచయం మల్లేశ్‌‌ను మరో స్థాయి నేరస్థుడిగా మార్చింది. బీర్బల్ షా.. భారత్‌లోకి అక్రమంగా చేరే ఆయుధాలను సేకరించి, వాటిని సరిహద్దులు దాటించే నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడు. అతడి ద్వారా బంగ్లాదేశ్‌కు చెందిన అక్రమ ఆయుధాల డీలర్ అవల్దేయ్ అలియాస్ ఓటీబీతో మల్లేశ్‌కు పరిచయం ఏర్పడింది.

తొలుత ఓటీబీ వద్ద నుంచి మల్లేశ్ రూ.10 వేలు చెల్లించి ఒక తుపాకీని కొనుగోలు చేశాడు. రాత్రివేళల్లో దారిన పోయేవారిని బెదిరించి దోపిడీలు చేయాలని చూసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అనంతరం ఆ తుపాకీని దాచిపెట్టాడు. 2023లో సస్పెన్షన్ రద్దయ్యాక మళ్లీ విధుల్లో చేరి, గతేడాది జూన్‌లో బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌కు బదిలీపై వచ్చాడు.

దోపిడీల ఆలోచన నుంచి ఆయుధాల విక్రయం వరకుబొల్లారంలో పనిచేస్తూనే ఉన్నతాధికారులతో గొడవపడి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తొలుత తన బాల్యమిత్రులైన నిరంజన్, మల్లికార్జున్‌లను సంప్రదించి.. ఆర్మీ నుంచి తుపాకులు దొంగిలించి బ్యాంకులు, నగల దుకాణాల్లో భారీ దోపిడీలు చేద్దామని ప్రతిపాదించాడు. అయితే మిత్రులు ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో అతడు నేరుగా ఆయుధాలను బంగ్లాదేశ్ డీలర్‌కే అమ్మి సొమ్ము చేసుకోవాలని పథకం రచించాడు.

ఈ క్రమంలో కోల్‌కతాలోని బీర్బల్ షాను సంప్రదించగా, బంగ్లాదేశ్ డీలర్ ఓటీబీకి ఆయుధాలు విక్రయించేందుకు ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం నాలుగు ఏకే-47 రైఫిళ్లకు గాను ఒక్కొక్క దానికి రూ.5 లక్షలు, పిస్తోళ్లకు ఒక్కొక్క దానికి రూ.3 లక్షలు చొప్పున చెల్లించేందుకు బేరం ఖరారైంది. ఇప్పటికే ఓటీబీకి నమూనాగా ఒక పిస్తోలు చేరినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.

బొల్లారంలో పక్కా ప్లాన్ ప్రకారం చోరీ

మద్రాస్ రెజిమెంట్ 20వ బెటాలియన్‌లో పలుమార్లు రెక్కీ నిర్వహించిన మల్లేశ్, అక్కడ పనిచేస్తున్న జవాన్ శేషులు, ప్రవీణ్‌ల సహకారాన్ని కోరాడు. ఆయుధాగారం వద్ద విధులు నిర్వర్తిస్తున్న వినోద్ అనే మరో జవానును ప్రలోభపెట్టేందుకు శేషులు ద్వారా రూ. లక్ష అడ్వాన్స్‌గా ఇప్పించాడు. దీంతో వినోద్ చోరీకి వారం రోజుల ముందు నుంచే ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పనిచేయకుండా జాగ్రత్తపడ్డాడు.

దొంగతనం జరిగిన రోజు రాత్రి మల్లేశ్ మిగిలిన సీసీ కెమెరాలపై ఫోమ్ స్ప్రే చేసి దృశ్యాలు రికార్డు కాకుండా అడ్డుకున్నాడు. ప్రవీణ్, శేషులు ఆవరణలోని విద్యుత్తు దీపాలను ఆర్పివేసి చీకటిని సృష్టించారు. సుమారు గంటపాటు సాగిన ఈ చోరీలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ట్రాలీ ద్వారా తరలించారు. ఆ సమయంలో పెట్రోలింగ్‌లో ఉన్న ఇతర జవాన్ల దృష్టి మళ్లించి తుపాకులను సురక్షితంగా బయటకు తరలించినట్లు మల్లేశ్ విచారణలో అంగీకరించాడు.

ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అంతర్జాతీయ సరిహద్దులతో సంబంధమున్న కీలక నిందితులు బీర్బల్ షా, బంగ్లాదేశ్ డీలర్ ఓటీబీల ఆచూకీ కనుగొనేందుకు ఆరు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. సైనిక విభాగానికి సంబంధించిన రక్షణ అంశాలపై ఉన్నత స్థాయి అధికారులు సైతం అంతర్గత పరిశీలన ప్రారంభించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports