Last Updated:
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు భారత్ సమర్పించిన కాల్పుల విరమణ ప్రతిపాదన ఎంతో సమగ్రమైనదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా ప్రశంసించారు. ఇంధన, నల్లసముద్ర భద్రతతో కూడిన ఒప్పందానికి తాము సిద్ధమని ప్రకటించారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ యుద్ధంలో శాంతి స్థాపనకు భారత ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. తమ వద్దకు భారత్, టర్కీ, ఈజిప్ట్, అమెరికా నుంచి నాలుగు కాల్పుల విరమణ ప్రతిపాదనలు వచ్చాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా కీవ్‌లో వెల్లడించారు. వీటిలో భారత్ పంపిన ముసాయిదా ఎంతో లోతైనదని, సమగ్రమైందని ఆయన స్పష్టం చేశారు. ఈ సంక్షోభ పరిష్కారంలో మధ్యవర్తి పాత్ర పోషించడానికి భారత్ తొలిసారి సుముఖత వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. అయితే రష్యాతో తాత్కాలిక కాల్పుల విరమణ జరగాలంటే కేవలం యుద్ధక్షేత్రానికే కాకుండా ఇంధన వనరులు, నల్లసముద్రం మీదుగా రవాణా రక్షణకు భరోసా ఉండాలని తేల్చిచెప్పారు. విద్యుత్ కేంద్రాలు, నౌకాశ్రయాలపై దాడులు పూర్తిగా ఆగితేనే ఎలాంటి షరతులు లేని కాల్పుల విరమణకు తాము అంగీకరిస్తామని ఉక్రెయిన్ స్పష్టం చేసింది.
ఇతర దేశాల ప్రతిపాదనలను కూడా తాము పరిశీలిస్తున్నామని సిబిహా తెలిపారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఈజిప్ట్‌కు ఆహార భద్రత అత్యంత కీలకమైనందున టర్కీతో కలిసి నల్లసముద్రంలో వ్యవసాయ ఎగుమతుల రక్షణ కోసం ప్రతిపాదన ఇచ్చాయి. అమెరికా కేవలం ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపాలని సూచించింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ ద్వారానే కాల్పుల విరమణ సాధ్యమవుతుందని ఉక్రెయిన్ పేర్కొంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలను కొనియాడారు. మోదీకి ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన అద్భుత పరిష్కారాలు ఉన్నాయని వాల్డై ఫోరంలో ప్రశంసించారు. యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్న మోదీ ఆలోచనలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ప్రపంచ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం దృష్ట్యా నల్లసముద్రంలో రవాణా రక్షణ కోసం ఐక్యరాజ్యసమితి, టర్కీ మళ్లీ చర్చలు ప్రారంభించాయి. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన శాంతి సూత్రాన్ని ముందుకు తెచ్చిన భారత్ ఈ సంక్షోభంలో కీలక పాత్ర పోషించనుంది.














