Last Updated:
ఫ్లైదుబాయ్ విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేయడానికే కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేశానని ఒమనీ కో-పైలట్ హమామ్ అల్ హమ్మామి అంగీకరించాడు. మరణానికి భయపడబోనని దర్యాప్తు అధికారుల ఎదుట ఒప్పుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై అత్యవసర గొడ్డలితో దాడి చేసిన ఒమన్ కో-పైలట్ హమామ్ అల్ హమ్మామి దర్యాప్తు అధికారుల ఎదుట సంచలన నిజాలు వెల్లడించాడు. 170 మందికి పైగా ప్రయాణికులు ఉన్న విమానాన్ని ఉద్దేశపూర్వకంగా నేలకేసి కూల్చివేయడమే తన ప్రధాన లక్ష్యమని, చావుకు తాను ఎంతమాత్రం భయపడనని అతడు స్పష్టం చేశాడు. సౌదీ దర్యాప్తు బృందాల విచారణలో ఈ విషయాలు బయటకు వచ్చినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. తీవ్రవాద వెబ్సైట్లు వీక్షిస్తున్నాడనే కారణంతో గతంలోనే ఒమన్ ఎయిర్ సంస్థ ఇతడిని విధులనుంచి తప్పించింది. డీ-రాడికలైజేషన్ ప్రోగ్రామ్‌కు కూడా పంపించింది. అయినప్పటికీ ఇటువంటి తీవ్ర మానసిక స్థితి ఉన్న వ్యక్తి అంతర్జాతీయ విమానంలోకి ఎలా ప్రవేశించాడనేది ఇప్పుడు విమానయాన రంగంలో పెను కలకలం రేపుతోంది.
సౌదీ అరేబియా గగనతలంలో విమానం ప్రయాణిస్తున్న సమయంలో కో-పైలట్ హమామ్ అత్యవసర గొడ్డలితో కెప్టెన్ స్మిత్ తలపై బలంగా దాడి చేశాడు. దాదాపు అర గంట పాటు విమానం ట్రాన్స్‌పాండర్‌ను ఆపివేశాడు. కంట్రోల్ ప్యానెల్‌ను ధ్వంసం చేస్తూ విమానాన్ని ఒక్కసారిగా కిందకు దించేశాడు. కేవలం 30 సెకన్లలోనే విమానం 16 వేల అడుగుల కిందకు పడిపోయింది. విమానంలోని ప్రయాణికులు హాహాకారాలు చేశారు.
తీవ్ర రక్తస్రావం జరుగుతూ నేలపై పడిపోయిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చార్ అసాధారణ ధైర్యం కనబరిచాడు. కాక్‌పిట్ డోర్ లాక్ తెరిచి సహాయం కోసం అరవడంతో సమీపంలో ఉన్న మహిళా ప్రయాణికురాలు చూసి కేకలు వేసింది. వెంటనే నలుగురు ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి హమామ్పై దాడి చేసి కంట్రోల్స్ నుంచి పక్కకు లాగేశారు. అనంతరం ఇయర్‌ఫోన్ కేబుల్స్‌తో అతడి చేతులు కట్టేసి బంధించారు.
ఒక ప్రయాణికుడు గతంలో టీవీలో విమాన ప్రమాదాల డాక్యుమెంటరీలు చూసిన అనుభవంతో కంట్రోల్స్ పట్టుకుని విమానాన్ని నిలకడగా మార్చాడు. ఆ తర్వాత అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ఆఫ్-డ్యూటీ ఫ్లైదుబాయ్ పైలట్లు కాక్‌పిట్‌లోకి వచ్చి విమానాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడే ఉన్న ఒక డాక్టర్ గాయపడిన భారత కెప్టెన్‌కు ప్రథమ చికిత్స అందించారు.
తీవ్ర గందరగోళం, అలజడి తర్వాత పైలట్లు విమానాన్ని దారి మళ్లించి సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. వెంటనే రంగంలోకి దిగిన సౌదీ భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన కెప్టెన్ స్మిత్‌ను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు, సిబ్బంది సమయస్ఫూర్తి వల్ల పెను ఉగ్రవాద విమాన ప్రమాదం తృటిలో తప్పింది.
న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. హమామ్ గత సోషల్ మీడియా పోస్టులను పరిశీలిస్తే అతడిలోని విపరీతమైన మతోన్మాదం బయటపడింది. మహిళలు ఉద్యోగాలు చేయడాన్ని అతడు తీవ్రంగా వ్యతిరేకించాడు. దాడి జరిగిన రోజే మక్కా, మదీనా, జెరూసలేం మార్గాన్ని చూపుతూ, మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదనే భావన ఉన్న అరబిక్ విప్లవ కవితను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ కుట్ర వెనుక ఇతర తీవ్రవాద సంస్థల హస్తంపై సమగ్ర విచారణ జరుగుతోంది.














