Last Updated:
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఓ ఘటన ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆమెను లక్ష్యంగా చేసుకుని ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ రూపొందించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడం కలకలం రేపింది.
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఓ ఘటన ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆమెను లక్ష్యంగా చేసుకుని ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ రూపొందించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ జాన్వీకి మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ తన గళాన్ని వినిపించారు.
ఏ మహిళ విషయంలోనూ ఇలాంటి ఘటనలు జరగకూడదని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. మహిళల గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించకూడదని తన స్టాండ్‌ను స్పష్టం చేశారు. తారక్ స్పందన తర్వాత మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఈ అంశంపై మాట్లాడటంతో జాన్వీకి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

తాజాగా ఈ ఘటనపై జాన్వీ కపూర్ స్వయంగా స్పందించారు. మహిళలను ఒక వస్తువులా చూసే విధానాన్ని, వారి అనుమతి లేకుండా కల్పిత విషయాలను రూపొందించి ప్రచారం చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. టెక్నాలజీని ఇలాంటి అనైతిక చర్యలకు ఉపయోగించడం సాధారణ విషయం కాదని, ఇది తీవ్రమైన ఉల్లంఘనతో పాటు లైంగిక వేధింపులతో సమానమని ఆమె పేర్కొన్నారు.
తన పరిశ్రమలోని దాదాపు ప్రతి మహిళ ఏదో ఒక రూపంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారని జాన్వీ తెలిపారు. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. మహిళల శరీరానికి, వ్యక్తిత్వానికి ఇవ్వాల్సిన గౌరవం అనేది మానవత్వానికి సంబంధించిన అత్యంత ప్రాథమిక అంశంగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.
తనపై జరిగిన ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బలమైన వైఖరి తీసుకున్నందుకు జూనియర్ ఎన్టీఆర్‌కు జాన్వీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు వ్యక్తిగతంగా సంబంధం లేని అంశంపై కూడా ఓ మహిళకు అండగా నిలిచి గళం వినిపించినందుకు తారక్‌కు ధన్యవాదాలు చెప్పారు.
లక్షలాది మంది అభిమానులు ఆదర్శంగా భావించే ఓ వ్యక్తి.. తనకు నేరుగా సంబంధం లేని విషయంలో కూడా అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తుందని జాన్వీ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులను ఏదో ఒక రూపంలో ఎదుర్కొన్న మహిళలకు సెలబ్రిటీల మద్దతు ఎంతో బలాన్ని ఇస్తుందని ఆమె తెలిపారు.
అదేవిధంగా ఈ విషయంపై తనతో పాటు గళం కలిపిన మెగాస్టార్ చిరంజీవి, నటుడు విజయ్, నటి ఖుష్బూ సుందర్‌లకు కూడా జాన్వీ కపూర్ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి అనైతిక చర్యలు, వాటి వెనుక ఉన్న మనస్తత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పారు.
జాన్వీ కపూర్ చేసిన ఈ స్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్నాలజీని దుర్వినియోగం చేసి మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలపై సినీ ప్రముఖులు ఒకే మాటగా స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహిళల పట్ల గౌరవం, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరాన్ని జాన్వీ తన పోస్ట్ ద్వారా మరోసారి గుర్తుచేశారు.














