USA: గుంటూరు డాక్టర్ పెద్ద మనసు.. అమెరికా యూనివర్సిటీకి రూ. 10 కోట్ల విరాళం! | | ACTPnews

డాక్టర్ శ్రీమన్నారాయణ దంపతులు


Last Updated:

USA: విద్య, వైద్య రంగాల పురోగతికి విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ వంతు సహకారాన్ని అందిస్తూ మాతృభూమి కీర్తిని దశదిశలా చాటుతున్నారు.

డాక్టర్ శ్రీమన్నారాయణ దంపతులు
డాక్టర్ శ్రీమన్నారాయణ దంపతులు

గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ, ఆయన సతీమణి రమ దంపతులు అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో (యూసీఎస్‌ఎఫ్) విద్యా సంస్థకు 1 మిలియన్ అమెరికన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.10 కోట్లు) భారీ విరాళాన్ని అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

శ్రీమన్నారాయణ దంపతులు అందజేసిన ఈ 1 మిలియన్ డాలర్ల విరాళాన్ని విశ్వవిద్యాలయం శాశ్వత నిధిగా భద్రపరచనుంది. ఈ మూలధనంపై ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీ, వార్షిక ఆదాయాన్ని వినియోగించి, వైద్య విద్యను అభ్యసిస్తున్న అత్యుత్తమ ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించనున్నారు. దీనిద్వారా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్యకు దూరం కాకుండా ఎంతో మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లభించనుంది.

ఫ్రెజ్నోలో జరిగిన కార్యక్రమంలో అభినందనలు

కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రెజ్నో పట్టణంలో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో అంబటి శ్రీమన్నారాయణ దంపతులు ఈ విరాళానికి సంబంధించిన పత్రాలను వర్సిటీ ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ డీన్ జోస్ ఎం. బారల్ సాంచేజ్ మాట్లాడుతూ.. శ్రీమన్నారాయణ దంపతుల ఉదారతను కొనియాడారు. ఈ నిధులు కేవలం ఉపకార వేతనాలకే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే పరిశోధనలు, అత్యాధునిక అల్ట్రాసౌండ్ టెక్నాలజీ అభివృద్ధి, మరియు ఫ్యామిలీ మెడిసిన్ (కుటుంబ వైద్యం) రంగాల్లో వినూత్న అధ్యయనాలకు ఎంతగానో దోహదపడతాయని ఆయన వివరించారు.

మాతృభూమి, అమెరికా రుణాన్ని తీర్చుకుంటాం: డాక్టర్ శ్రీమన్నారాయణ

విరాళం అందజేసిన అనంతరం డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ.. తాము పుట్టి పెరిగిన భారతదేశం, అలాగే వృత్తిపరంగా ఉన్నత శిఖరాలకు చేరడానికి అవకాశాలు కల్పించి ఆశ్రయమిచ్చిన అమెరికా దేశం రెండూ తమకు సమానమేనని పేర్కొన్నారు. ఈ రెండు దేశాల రుణం తీర్చుకోవడానికే తాము సమాజ సేవలో ముందుంటున్నామని ఆయన వెల్లడించారు. డాక్టర్ శ్రీమన్నారాయణ గత నాలుగు దశాబ్దాలుగా అంటే 1986 సంవత్సరం నుంచే యూసీఎస్‌ఎఫ్ విశ్వవిద్యాలయంలో యూరాలజీ క్లినికల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఎంతో మంది నిపుణులైన వైద్యులను తీర్చిదిద్దారు. సొంత గడ్డపై అభిమానంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చేసిన ఈ భారీ ఆర్థిక సాయం పట్ల గుంటూరు ప్రజలతో పాటు ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports