Last Updated:
WCL: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మూడో సీజన్‌లో పాల్గొనడానికి రిటైర్డ్ పాకిస్థానీ క్రికెటర్లతో కూడిన ప్రైవేట్ జట్టు ‘పాకిస్థాన్ ఛాంపియన్స్’కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) గట్టి షాక్ ఇచ్చింది.
ఈ టోర్నీలో పాల్గొనేందుకు అవసరమైన అభ్యంతర పత్రం (NOC) ఇచ్చేందుకు పీసీబీ నిరాకరించింది. మోహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని పీసీబీ.. గతేడాది (2025) జరిగిన టోర్నీలో ‘ఇండియా ఛాంపియన్స్’ జట్టు తమతో రెండు మ్యాచ్‌లను బహిష్కరించిన తర్వాత, పాకిస్థాన్ తరఫున ఈ జట్టు ప్రాతినిధ్యం వహించకుండా నిషేధించింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా ‘పాకిస్థాన్ ఛాంపియన్స్’ యజమాని కమిల్ ఖాన్ పీసీబీని అభ్యర్థించినప్పటికీ, బోర్డు తన పట్టు సడలించలేదు.
భారత మీడియా కథనాల ప్రకారం.. గత బహిష్కరణకు గాను భారత ఆటగాళ్లు ‘లిఖితపూర్వక క్షమాపణ’ చెప్పాలని, అలాగే మైదానంలో పాక్ ఆటగాళ్లతో కరచాలనం (హ్యాండ్‌షేక్) చేయాలని పీసీబీ షరతు పెట్టింది. అయితే, పీసీబీ పెట్టిన ఈ కండిషన్లను డబ్ల్యూసీఎల్ (WCL) యాజమాన్యం తిరస్కరించింది. దీంతో పాక్ బోర్డు ఎన్ఓసీ ఇచ్చేందుకు ససేమిరా అంది.
పీసీబీ నిర్ణయంపై పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. “పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎన్ఓసీ (NOC) ఇచ్చేందుకు నిరాకరించడం వల్ల ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నమెంట్‌లో మా జట్టు పాల్గొనలేకపోతోందని చెప్పడానికి చింతిస్తున్నాము. మేము పీసీబీ నిర్ణయాన్ని, వారి అధికారాన్ని గౌరవిస్తాము. అయితే మా ఆటగాళ్లకు పాకిస్థాన్ ఛాంపియన్స్ తరఫున అంతర్జాతీయ లెజెండ్స్ టోర్నీలో ఆడే అవకాశం రాకపోవడం నిరాశ కలిగించింది. మాకు మద్దతుగా నిలిచిన ఆటగాళ్లకు, అభిమానులకు కృతజ్ఞతలు” అని పేర్కొంది.
2025 ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడిలో 25 మంది భారతీయులతో పాటు ఒక నేపాలీ పౌరుడు మృతి చెందారు. ఈ దాడితో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. దీంతో తీవ్ర జాతీయ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ‘ఇండియా ఛాంపియన్స్’ లీగ్ దశలో ‘పాకిస్థాన్ ఛాంపియన్స్’తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించింది. ఆ తర్వాత సెమీఫైనల్లోనూ భారత్ తప్పుకోవడంతో పాకిస్థాన్ నేరుగా ఫైనల్‌కు చేరింది. అయితే ఫైనల్లో షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, మిస్బా ఉల్ హక్‌లతో కూడిన పాకిస్థాన్ జట్టు సౌతాఫ్రికా ఛాంపియన్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఈ సీజన్‌లో అక్టోబర్ 10న భారత్ ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఇప్పుడు పాక్ బోర్డు నిర్ణయంతో ఆ మ్యాచ్ రద్దు కానుంది. కాగా, ఈ డబ్ల్యూసీఎల్ (WCL) లీగ్‌కు హర్షిత్ తోమర్‌తో పాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సహ భాగస్వామిగా ఉన్నారు.














