PM Modi: మోదీ, ఆ మహా విష్ణు అవతారమే.. భూటాన్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు! | | ACTPnews

News18


Last Updated:

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా భూటాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మోదీని విష్ణువు అవతారంగా ఎందుకు భావించారో.. దాని వెనుక ఉన్న భూటాన్ బౌద్ధ సంప్రదాయం ఏంటో తెలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది.

News18
News18

భారత ప్రధాని నరేంద్ర మోదీపై భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీని విష్ణువు అవతారంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆయనలో జ్ఞానం, కరుణ, ధైర్యం, నిస్వార్థ సేవ వంటి సద్గుణాలు కనిపిస్తున్నాయని వివరించారు. మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన అనుభవాలను పంచుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో ఢిల్లీలో మోదీని వ్యక్తిగతంగా కలిసినప్పుడు తనకు కలిగిన భావనను ఆయన గుర్తుచేసుకున్నారు.

2019 భేటీలో ఏం జరిగింది?

2019 జూలై 27న ఢిల్లీలో మోదీని కలిసినప్పుడు తోబ్గే భూటాన్ ప్రధానిగా లేరు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోవడంతో, పది నెలలుగా పార్లమెంటులోనూ ప్రాతినిధ్యం లేదు. అయినప్పటికీ మోదీని కలిసిన ఆయన, గతంలో తనకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. తనను ఎప్పటికీ అన్నయ్యగా భావిస్తానని చెప్పారు. వయసులో పెద్దవారు కావడం ఒక్కటే ఇందుకు కారణం కాదని, తమ్ముడిపై అన్న చూపించే ఆప్యాయతను మోదీ తనపై ప్రదర్శించారని వివరించారు. ఆ సందర్భంలోనే మోదీని విష్ణువు అవతారంగా చూస్తున్నానని చెప్పినట్లు తోబ్గే వెల్లడించారు. తొలుత తన మాటలు అతిశయోక్తిగా అనిపించినప్పటికీ, ఆ సమావేశాన్ని మళ్లీ గుర్తుచేసుకున్నప్పుడు తన అభిప్రాయం సరైనదేనని భావించినట్లు తెలిపారు.

బౌద్ధ సంప్రదాయంతో మోదీ నాయకత్వానికి పోలిక

భూటాన్ బౌద్ధ సంప్రదాయంలోని రిగ్‌సంగ్ గొన్‌పో భావనను తోబ్గే తన వ్యాఖ్యలకు ఆధారంగా వివరించారు. సమస్త జీవుల విముక్తికి అంకితమైన ముగ్గురు బోధిసత్వుల్లో మంజుశ్రీ జ్ఞానానికి, అవలోకితేశ్వరుడు కరుణకు, వజ్రపాణి ధైర్యానికి ప్రతీకలని పేర్కొన్నారు. ఈ మూడు లక్షణాలను నిస్వార్థ సేవతో మేళవించడమే ఉత్తమ నాయకత్వమని అభిప్రాయపడ్డారు. ఈ కోణంలోనే మోదీ నాయకత్వాన్ని, 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని విశ్లేషించారు. స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తయ్యే నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని భారత్ సంకల్పించిందని తెలిపారు. ‘వికసిత్ భారత్’ పేరుతో లక్ష్యానికి స్పష్టమైన గడువు, జాతీయ ప్రాధాన్యం కల్పించారని ప్రశంసించారు.

లక్ష్యం ప్రకటించడం వేరు.. సాధించడం వేరు!

దేశ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవడం కరుణకు నిదర్శనమని తోబ్గే పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయుల బలమైన, సంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశం కలలో ఈ లక్ష్యం ప్రతిబింబిస్తోందన్నారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ నినాదం సమష్టి అభివృద్ధిని సూచిస్తోందని చెప్పారు. మానవ వనరుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, పాలనలో మార్పులు తీసుకురావడానికి ధైర్యం, నిరంతర కృషి అవసరమని వివరించారు. “లక్ష్యాన్ని నిర్దేశించడం సులభం.. పరివర్తన తీసుకురావడం అంత సులభం కాదు” అనే భావనను వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ ఒక నాయకుడికో, ఒక ఎన్నికల కాలానికో పరిమితమైన కార్యక్రమం కాదని, భవిష్యత్ తరాలు కూడా భాగస్వాములవ్వాల్సిన జాతీయ ప్రయత్నమని అన్నారు. ‘సబ్‌కా ప్రయాస్’ ద్వారా ప్రజలను కేవలం మద్దతుదారులుగా కాకుండా దేశ నిర్మాణంలో భాగస్వాములుగా మార్చాలని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు.

మోదీకి ప్రముఖుల అభినందనలు

2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ, మూడు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా ప్రభుత్వాధినేతగా వరుసగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సమ్మిళిత అభివృద్ధిని జాతీయ ఉద్యమంగా మార్చారని ప్రశంసించారు. రవాణా అనుసంధానం, డిజిటల్ పురోగతి, అవకాశాల విస్తరణలో మార్పులను ప్రస్తావించారు. 25 కోట్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయటకు తీసుకురావడాన్ని మోదీ సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం కోట్లాది మంది ప్రజల ఆకాంక్షగా మారిందని, మోదీ నాయకత్వంలో దేశం ఎన్నో ఆశలతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports