Last Updated:
మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి సినిమాపై ఒక్కొక్కటిగా బయటకొస్తున్న అప్ డేట్స్ అభిమానుల్లో క్యూరియాసిటీ రెట్టింపు చేస్తున్నాయి. తాజాగా మరో విషయం హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో ఆస్కార్ స్థాయికి ఎదిగి గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ఈ సారి మహేష్ బాబుతో కలిసి ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి అక్కడ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, రాజమౌళి సినిమా కావడంతో ఈ గ్లోబల్ అడ్వెంచర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రియాంక చోప్రాతో పాటు మరో హాలీవుడ్ స్టార్ కూడా నటించనున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ బ్రిటిష్ నటి డైసీ జెస్సికా ఎడ్గర్ జోన్స్ ‘వారణాసి’ చిత్రంలో ఒక అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబు, డైసీల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి డైసీ ఎడ్గర్ జోన్స్ రాజమౌళికి కొత్త కాదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘జెన్నీ’ పాత్రకు మొదట ఆమెనే ఎంపిక చేశారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలు, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆ పాత్రను ఒలీవియా మోరిస్ పోషించారు. ఇప్పుడు జక్కన్న మళ్లీ ఆమెను ‘వారణాసి’ ద్వారా భారతీయ వెండితెరకు పరిచయం చేయబోతున్నారని విపరీతంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఈ సినిమా టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా చిత్రీకరణ కోసం రాజమౌళి అంటార్కిటికాను ఎంచుకోవడం విశేషం. అంటార్కిటికాలో చిత్రీకరణ జరుపుకుంటున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ రికార్డు సృష్టించనుంది. అక్కడి వాతావరణ పరిస్థితులు అత్యంత కఠినంగా ఉంటాయి. మంచు తుఫానులు, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు, కట్టుదిట్టమైన పర్యావరణ నిబంధనల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కేవలం కొన్ని సినిమాలు మాత్రమే అక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. అటువంటి ప్రదేశంలో మహేష్ బాబుతో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.
అత్యాధునిక టెక్నాలజీ, భారీ వీఎఫ్ఎక్స్, అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారతీయ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా దాదాపు రూ. 1,300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. కల్కి 2898 ఏడీ తర్వాత భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా ఇది నిలవనుంది. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు రాజమౌళి ఇప్పటికే ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. హాలీవుడ్ స్థాయి మేకింగ్, రాజమౌళి విజన్, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ కలగలిపి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.














