GST Council Meet: వ్యాపారులకు భారీ ఊరట.. రూ.10 వేల లోపు నోటీసులు బంద్.. 57వ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు! | | ACTPnews

News18


Last Updated:

వ్యాపారులకు ఊరట కల్పిస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.10 వేల లోపు పన్ను బకాయిలకు నోటీసులు ఇవ్వకూడదని, అధికారులకు ఉన్న అరెస్ట్ అధికారాలను రద్దు చేయాలని 57వ సమావేశంలో ప్రతిపాదించింది.

News18
News18

ఢిల్లీలో గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వ్యాపార వర్గాలకు భారీ ఊరటనిచ్చే కీలక ప్రతిపాదనలు చేసింది. పన్నుల ఎగవేత నియంత్రణ, దర్యాప్తు విధానాల్లో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా సరికొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. ఇకపై రూ.10,000 లోపు ఉండే స్వల్ప మొత్తాల పన్ను బకాయిలకు ఎలాంటి జీఎస్టీ నోటీసులు జారీ చేయకూడదని కౌన్సిల్ స్పష్టం చేసింది. వేధింపులకు ఆస్కారం లేకుండా జీఎస్టీ చట్టం కింద అధికారులకు ఉన్న అరెస్ట్ చేసే అధికారాలను పూర్తిగా తొలగించాలని ప్రతిపాదించింది. అలాగే క్రిమినల్ ప్రాసిక్యూషన్ పరిమితిని రూ.1 కోటి నుంచి ఏకంగా రూ.5 కోట్లకు పెంచింది. సాధారణ జరిమానా మొత్తాన్ని రూ.25,000 నుంచి రూ.10,000కు కుదించింది. వ్యాపారాలు సులభతరంగా సాగేలా విధానపరమైన సంస్కరణలను వేగవంతం చేస్తూ ఈ మార్పులను తీసుకొచ్చినట్లు కౌన్సిల్ ప్రకటించింది.

నోటీసుల విధానంలో పారదర్శకత.. ఉమ్మడి నిబంధనలు

జీఎస్టీ వివాదాల పరిష్కారానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉమ్మడి నిబంధనలను తీసుకురానున్నారు. పన్ను నోటీసులు ఎలా పంపాలి, ప్రాథమిక సమాచారం ఎలా అందించాలి, మోసాలను ఎప్పుడు ఆపాదించాలి, విచారణలు ఎలా జరపాలి అనే అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తారు. రిటర్నులు ఆలస్యంగా దాఖలు చేసినా, చెల్లింపుల్లో చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా కేవలం రావాల్సిన సొమ్ము, వడ్డీ, స్వల్ప జరిమానా మాత్రమే వసూలు చేస్తారు తప్ప కఠిన క్రిమినల్ చర్యలు ఉండవని స్పష్టం చేశారు.

అరెస్ట్ అధికారాలు బంద్.. కోర్టులకే శిక్షల నిర్ణయం

జీఎస్టీ చట్టంలో అధికారులకు ఉన్న తక్షణ అరెస్ట్ చేసే అధికారాలను తొలగించడం ద్వారా వర్తకులకు పెద్ద ఊరట లభించింది. క్రిమినల్ కేసు నమోదు చేయాలంటే మోసం విలువ కనీసం రూ.5 కోట్లు దాటాల్సి ఉంటుంది. చట్టంలో ఉన్న కనీస శిక్ష నిబంధనను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. నిందితుడికి జరిమానా విధించాలా, జైలు శిక్ష వేయాలా లేక రెండూ వర్తింపజేయాలా అనే తుది నిర్ణయాన్ని పూర్తిగా న్యాయస్థానాల విచక్షణకే వదిలేస్తూ నిబంధనల్లో మార్పులు చేశారు.

సరికొత్త డేటా వ్యవస్థ.. ఫేక్ ఇన్‌వాయిస్‌లకు చెక్

గతంలో చట్టం తెచ్చినప్పుడు తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల భయపెట్టే పద్ధతులపై ఆధారపడాల్సి వచ్చిందని కౌన్సిల్ వివరించింది. ప్రస్తుతం ఉన్న అధునాతన ఏఐ, డిజిటల్ సిస్టమ్స్ ద్వారా అమ్మకందారుడు, కొనుగోలుదారుల బిల్లులను సులువుగా సరిపోల్చవచ్చు. నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పుట్టిన చోటే దాన్ని కనిపెట్టే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దీంతో భయపెట్టి పన్నులు వసూలు చేసే పద్ధతి నుంచి బయటపడి, డేటా ఆధారిత గుర్తింపు విధానానికి మారుతున్నట్లు వెల్లడించింది.

నిబంధనలు పాటించే కొనుగోలుదారులకు రక్షణ

సరైన బిల్లు కలిగి ఉండి, సరుకులు తీసుకుని, అమ్మకందారుడికి పూర్తి చెల్లింపులు చేసిన నిజాయితీపరులైన కొనుగోలుదారులకు రక్షణ కల్పించే అంశంపై కౌన్సిల్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీనిపై అధ్యయనం చేయడానికి అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మూడు నెలల్లో సమగ్ర నివేదిక సమర్పిస్తుంది. తదుపరి కౌన్సిల్ భేటీలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రిజిస్ట్రేషన్లు, రిటర్నులు, రీఫండ్లు, ఐటీసీ వంటి రోజువారీ వ్యాపార సమస్యలను పరిష్కరించడానికే ఈ సంస్కరణలు తోడ్పడనున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports