Last Updated:
నోయిడా జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం’గా పేరు మార్చే ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్ జిల్లా జెవార్‌లో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. శుక్రవారం లక్నోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. విమానాశ్రయానికి ‘నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, నోయిడా-జెవార్’గా పేరు మార్పు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌కు ఈ భారీ ప్రాజెక్టును కానుకగా అందించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎయిర్‌పోర్ట్ యూపీలోనే అతిపెద్దదిగా నిలవడమే కాకుండా, భవిష్యత్తులో దేశంలోనే అత్యంత కీలకమైన ఏవియేషన్ హబ్‌గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని గ్లోబల్ కనెక్టివిటీ కేంద్రంగా మార్చడంలో ఇది మైలురాయిగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా జరిగిన మౌలిక వసతుల అభివృద్ధిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రంలో సుమారు రూ. 60,000 కోట్ల వ్యయంతో 2,483 కిలోమీటర్ల మేర 42 జాతీయ రహదారులను నిర్మించామని చెప్పారు. ఢిల్లీ-సహారన్‌పూర్-డెహ్రాడూన్, ఢిల్లీ-మీరట్, కాన్పూర్-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణాలను పూర్తి చేశామని గుర్తుచేశారు. దేశంలోనే తొలి హైస్పీడ్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్) ప్రాజెక్ట్ అయిన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ‘నమో భారత్’ రైలును రూ.30,000 కోట్లకు పైగా ఖర్చుతో అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. లక్నో, కాన్పూర్, ఆగ్రా, మీరట్, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడాలలో మెట్రో విస్తరణ వేగంగా సాగుతోందని వెల్లడించారు.
తూర్పు, పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లను కలిపే దాద్రి జంక్షన్ ద్వారా 1,050 కిలోమీటర్ల మేర సరుకు రవాణా మార్గం రాష్ట్రం గుండా వెళ్తోందని యోగి పేర్కొన్నారు. వారణాసిలో జాతీయ జలమార్గం-1పై దేశంలోనే మొట్టమొదటి మల్టీ-మోడల్ ఇన్‌ల్యాండ్ పోర్ట్ టెర్మినల్, 100 ఎకరాల్లో ఫ్రైట్ విలేజ్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామిక రంగంలో లక్నోలోని బ్రహ్మోస్ క్షిపణి అసెంబ్లీ యూనిట్‌తో కూడిన యూపీ డిఫెన్స్ కారిడార్, 1,000 ఎకరాల్లో ఏర్పాటవుతున్న పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్ రాష్ట్ర పురోగతికి కొత్త ఊపునిస్తున్నాయని వివరించారు.
జెవార్ ఎయిర్‌పోర్ట్ ద్వారా అంతర్జాతీయ ప్రయాణికులకు దిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా అద్భుతమైన సేవలు అందనున్నాయి. ఇప్పటికే రన్‌వే ట్రయల్స్ ముగియడంతో త్వరలోనే వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, ఐటీ రంగాల్లో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.














