Last Updated:
Viral: చట్టాన్ని కాపాడి ఖైదీలను సక్రమ మార్గంలో నడపాల్సిన ఓ జైలు అధికారిణి అధికార మదంతో చట్టాన్ని ఉల్లంఘించి, చివరకు తాను పనిచేసిన కారాగారానికే ఖైదీగా చేరిన విచిత్రమైన సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
రాజస్థాన్‌లోని అజ్మేర్ కేంద్ర కారాగారంలో పనిచేస్తున్న మహిళా జైలర్ దివ్యా చౌధరి చేసిన ఈ నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అజ్మేర్ సెంట్రల్ జైలులో ఇద్దరు మహిళలు హత్య కేసులలో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నారు. కాగా, జైలర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దివ్యా చౌధరి జులై 12న ఆ ఇద్దరు జీవితఖైదీలను జైలు నిబంధనలకు విరుద్ధంగా బయటకు తీసుకొచ్చారు. న్యాయస్థానం నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా, కనీసం జైలు రికార్డులు లేదా అధికారిక రిజిస్టర్లలో ఎలాంటి సమాచారం నమోదు చేయకుండా ఆమె అత్యంత గోప్యంగా వ్యవహరించారు. ఒక ప్రైవేటు వాహనంలో ఆ ఖైదీలను ఎక్కించుకుని అజ్మేర్‌లోని తన సొంత ఫ్లాట్‌కు తరలించారు. తన ప్రైవేటు ఫ్లాట్‌ను శుభ్రం చేయించడం తదితర ఇంటి పనుల కోసం వారిని పనిమనుషులుగా వినియోగించుకున్నారు.
హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న కరడుగట్టిన మహిళా ఖైదీలను జైలు వెలుపలికి పనుల నిమిత్తం తీసుకెళ్లిన తీవ్ర వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం ఆగస్టు 5న సివిల్ లైన్స్ పోలీస్ స్టేషనులో కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి జైలర్ దివ్యా చౌధరితో పాటు ఆమెకు సహకరించిన జైలు గార్డు సోనియా చౌధరిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే కేసు నమోదైన విషయం తెలుసుకున్న వీరిద్దరూ అరెస్టు భయంతో పోలీసులకు దొరకకుండా పరారయ్యారు.
పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం కోటా నగరంలో దాక్కున్న జైలర్ దివ్యా చౌధరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించారని డీఎస్పీ (ఉత్తర) శివమ్ జోషి మీడియాకు వెల్లడించారు. దీంతో నిన్నటివరకు అధికారుల హోదాలో ఖైదీలపై అధికారం చెలాయించిన దివ్యా చౌధరి, ఇప్పుడు అదే అజ్మేర్ కేంద్ర కారాగారంలో సాధారణ ఖైదీగా ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార దుర్వినియోగానికి పాల్పడే అధికారులకు ఈ ఘటన ఒక గట్టి హెచ్చరికలా మారిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.














