Last Updated:
Trump: టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) నామకరణంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత విచిత్రమైన, వివాదాస్పద వైఖరిని ప్రదర్శించారు.
ప్రపంచమంతా ఏఐ అని పిలుస్తున్న ఈ సాంకేతికతను ఇకపై ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (ఉత్తమ మేధ లేదా ఎస్ఐ) అని మాత్రమే పిలవాలని ఆయన హుకుం జారీ చేశారు. అలా పిలవకుండా ఇప్పటికీ పాత పదాన్నే వాడేవారిని ఏకంగా ‘దేశద్రోహులు’గా పరిగణిస్తామని హెచ్చరించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ద్వారా ట్రంప్ ఈ వివాదానికి తెరలేపారు. “ప్రజలందరి ఆమోదం పొందిన ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనే పదానికి బదులుగా, ఎవరైనా పనిగట్టుకుని ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అని వాడితే వైట్‌హౌస్ వారిని దేశ శత్రువులుగానే పరిగణిస్తుంది” అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు. ఒక సాంకేతిక పరిభాష లేదా పదం వాడకం ఆధారంగా పౌరులను దేశద్రోహులుగా ముద్రవేయాలనే ట్రంప్ ఆలోచనపై మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వాదన పూర్తిగా వితండవాదంగా ఉందని పలువురు అభివర్ణిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకూ విస్తరిస్తోంది. ఉద్యోగాల కోత, సమాచార భద్రత, సైబర్ దాడులు, డీప్‌ఫేక్‌ల వంటి పరిణామాలతో ప్రజల్లో ఏఐ పట్ల భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నయా సాంకేతికత మరింత విచ్చలవిడిగా మారకముందే ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెచ్చి నియంత్రించాలని అంతర్జాతీయ టెక్ నిపుణులు, పాలసీ రూపకర్తలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కీలకమైన తరుణంలో, ఏఐ దుష్పరిణామాలను ఎలా అరికట్టాలనే ప్రధాన సమస్యను పక్కనపెట్టి.. ట్రంప్ దానికి పేరు మార్చాలంటూ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనే ప్రతిపాదనను తెరపైకి తేవడం గమనార్హం.
ఒకవైపు టెక్నాలజీ నియంత్రణపై విస్తృత చర్చ జరుగుతుండగా, మరోవైపు కేవలం పదజాలం చుట్టూ దేశభక్తి, దేశద్రోహం అంశాలను ముడిపెట్టడం ట్రంప్ నైజానికి అద్దం పడుతోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఎప్పటిలాగే తన వివాదాస్పద శైలితో వార్తల్లో నిలిచే ట్రంప్.. ఈసారి ఏఐ టెక్నాలజీని కూడా రాజకీయ వివాదంలోకి లాగడం గ్లోబల్ టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.














