Last Updated:
రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు ఆపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఒప్పందం కుదుర్చుకోగల కొత్త నాయకుడు ఉక్రెయిన్‌కు అవసరమని ట్రంప్ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది.
రష్యా ఆయిల్ రిఫైనరీలపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. శనివారం వైట్‌హౌస్ వద్ద మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఈ దాడులను జెలెన్‌స్కీ ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు సరైన ఒప్పందం చేసుకోగల కొత్త నాయకత్వం ఉక్రెయిన్‌కు అవసరమని ఆయన బాహాటంగా సూచించారు. అంతర్జాతీయ విపణిలో డీజిల్ ధరలను తగ్గించేందుకు రష్యాతో అమెరికా కుదుర్చుకున్న కొత్త ఒప్పందంపై జెలెన్‌స్కీ బహిరంగంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వెంటనే ట్రంప్ నుంచి ఈ ఘాటు స్పందన వచ్చింది. ఉక్రెయిన్ దాడుల వల్ల అమెరికా పౌరులపై కూడా ఇంధన ధరల భారం పడుతోందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఈ పరిణామం తీవ్ర దూరాన్ని పెంచింది.
న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. రష్యా నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు డీజిల్ సరఫరా చేసేందుకు ఆంక్షలు సడలిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని జెలెన్‌స్కీ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ వెసులుబాటు పుతిన్‌కు ఇచ్చే పెద్ద బహుమతి లాంటిదని, రష్యాకు భారీగా నిధులు సమకూరి యుద్ధాన్ని మరింత కాలం కొనసాగించేందుకు దారితీస్తుందని హెచ్చరించారు. ఇలా ఆంక్షలు సడలించిన వెంటనే జపోరిజియాలోని నివాస ప్రాంతాలపై రష్యా బాంబుల దాడి చేసి 15 మందిని పొట్టనబెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మయామి నగరంలో అమెరికా రాయబారులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లు ఉక్రెయిన్ ప్రతినిధులతో ఎనిమిది గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. రష్యాపై దాడులు ఆపాలని అమెరికా ఆరుసార్లు కోరినా జెలెన్‌స్కీ పట్టించుకోలేదని వాషింగ్టన్ వర్గాలు తెలిపాయి. తమ పవర్ ప్లాంట్లపై రష్యా దాడులు ఆపితేనే రిఫైనరీలపై దాడులు ఆపుతామని జెలెన్‌స్కీ షరతు పెట్టగా, ఎలాంటి షరతులు లేకుండానే దాడులు ఆపాలని అమెరికా పట్టుబట్టింది.
ట్రంప్ మాట వినకపోతే ఉక్రెయిన్‌కు అందిస్తున్న సైనిక సమాచారం (ఇంటెలిజెన్స్ డేటా) నిలిపివేస్తామని అమెరికా హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అమెరికా వినియోగదారులపై పడే భారాన్ని తగ్గించేందుకే డీజిల్ ఆంక్షలు సడలించామని ట్రంప్ వర్గాలు చెబుతుండగా, ఈ వివాదం ఉక్రెయిన్-అమెరికా బంధాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది.














