Last Updated:
రష్యా, ఉక్రెయిన్ దేశాలు పరస్పరం విద్యుత్, చమురు కేంద్రాలపై దాడులు ఆపేందుకు ‘ఎనర్జీ సీజ్ఫైర్’ కుదుర్చుకున్నాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం గురించి తనకు ముందస్తు సమాచారం లేదని జెలెన్స్కీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య తక్షణమే ‘ఇంధన కాల్పుల విరమణ’ (ఎనర్జీ సీజ్ఫైర్) అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. విద్యుత్, చమురు కేంద్రాలపై ఇరు దేశాలు పరస్పరం దాడులు ఆపేందుకు అంగీకరించాయని, ఎవరూ నిబంధనలు ఉల్లంఘించవద్దని ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. అయితే ఈ విషయం తనకు ముందుగా తెలియదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ స్పష్టం చేశారు. రష్యా తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపితే తాము కూడా రిఫైనరీలపై దాడులు నిలిపివేసేందుకు సిద్ధమేనని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో అమెరికా పౌరులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా వచ్చిన ఈ ప్రకటన అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.

న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఈ కాల్పుల విరమణ ప్రకటన తనకు పూర్తిగా కొత్త విషయమని మీడియా సంస్థ ‘ఆక్సియోస్’తో జెలెన్స్కీ అన్నారు. రష్యాతో ట్రంప్ నిజంగానే ఒప్పందం కుదిర్చి ఉంటే ఆ నిబంధనలు ఎప్పటి నుంచి అమలవుతాయో స్పష్టత ఇవ్వాలని కోరారు. తాము ఈ నిర్ణయాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రష్యా ప్రభుత్వ రంగ సంస్థ రోసాటమ్ సైతం జపోరిజియా పవర్ ప్లాంట్ మరమ్మతుల కోసం ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
రష్యా నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు డీజిల్ సరఫరా చేసేందుకు ట్రంప్ ఇటీవల పుతిన్‌తో ప్రత్యేక ఒప్పందం చేసుకున్నారు. దీనిపై జెలెన్స్కీ మండిపడుతూ ఇది పుతిన్‌కు ఇచ్చే బహుమతి అని విమర్శించారు. దాంతో ఆగ్రహించిన ట్రంప్, ఉక్రెయిన్‌కు ఒప్పందాలు చేసుకోగల కొత్త నాయకుడు అవసరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్ చేస్తున్న దాడుల వల్లే ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడుతోందని ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అమెరికా పదేపదే హెచ్చరిస్తున్నా ఉక్రెయిన్ రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులను ఆపలేదు. తమ దేశంలోని పవర్ గ్రిడ్లపై మాస్కో బాంబుల దాడి ఆపితేనే తాము వెనక్కి తగ్గుతామని జెలెన్స్కీ షరతు విధించారు. ఈ ప్రతిష్టంభన నడుమ ట్రంప్ స్వయంగా ఈ ఇంధన కాల్పుల విరమణను ప్రకటించడం యుద్ధ గమనాన్ని ఎలా మారుస్తుందో వేచి చూడాలి.














