Last Updated:
Goa: ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగం సంపాదించాలనే దురాశతో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి కాకుండా మోసాలకు వాడుతూ అడ్డంగా బుక్కవుతున్నారు.
ఐఐటీ గోవా (IIT Goa) ఉద్యోగ నియామక పరీక్షలో బ్లూటూత్ డివైజ్‌లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు నిందితులు చివరికి విమానాశ్రయంలో భద్రతా బలగాలకు పట్టుబడిన ఘటన గోవాలో తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే..ఇటీవల సెప్టెంబరు 10వ తేదీన ఐఐటీ గోవా ఆధ్వర్యంలో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో కొందరు అభ్యర్థులు అక్రమ మార్గాల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళిక రచించారు. పరీక్ష పూర్తయిన తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లేందుకు నిందితులు గోవాలోని దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం ఎక్కేందుకు ముందు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్ – CISF) సిబ్బంది సాధారణ భద్రతా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి ప్రవర్తన భద్రతా సిబ్బందికి తీవ్ర అనుమానాస్పదంగా కనిపించింది.
సందేహం వచ్చిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది సదరు ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగ్‌ను నిశితంగా పరిశీలించారు. ఆ బ్యాగులో రహస్యంగా దాచిన 3 అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు, 2 సిమ్ కార్డులు, 3 అత్యంత సూక్ష్మమైన బ్లూటూత్ ఇయర్ ఫోన్ పరికరాలు బయటపడ్డాయి. భద్రతా అధికారులు ఆ పరికరాల గురించి గట్టిగా ఆరా తీయడంతో నిందితుడు నిజం అంగీకరించక తప్పలేదు. ఐఐటీ గోవా రిక్రూట్‌మెంట్ పరీక్షలో బయటి వ్యక్తుల నుంచి సమాధానాలు తెలుసుకునేందుకు ఈ బ్లూటూత్ పరికరాల ద్వారా కాపీ చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా, ఈ మోసంలో భాగస్వామిగా ఉన్న తన సహచరుడు అప్పటికే విమానం ఎక్కాడని సమాచారం ఇచ్చాడు.
వెంటనే అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్ బలగాలు విమానయాన సంస్థ సిబ్బంది సహకారంతో ఢిల్లీ విమానంలో కూర్చున్న రెండో నిందితుడిని కిందకు దించారు. అతడిని కూడా తనిఖీ చేయగా మరో బ్లూటూత్ డివైజ్, సిమ్ కార్డు లభ్యమయ్యాయి. విచారణలో వీరిద్దరిలో ఒకరు అసలైన అభ్యర్థికి బదులుగా నకిలీ గుర్తింపుతో పరీక్ష రాసినట్లు వెల్లడైంది. ఇంటెలిజెన్స్, రక్షణ నిఘా వర్గాలు వీరిద్దరినీ సంయుక్తంగా క్షుణ్ణంగా ప్రశ్నించిన అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం దబోలిమ్ విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. ఈ ముఠా వెనుక ఏదైనా పెద్ద పేపర్ లీకేజీ లేదా పరీక్షల మాఫియా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.














