Last Updated:
ప్రమాదంలో చిక్కుకున్న తన ముగ్గురు స్నేహితులను ప్రాణాలకు తెగించి కాపాడిన ఆ యువకుడు, చివరకు విధి ఆడిన వింత నాటకంలో నీట మునిగి ప్రాణాలు వదిలాడు.
Tragedy: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి, కొద్దిరోజుల క్రితమే పట్టభద్రుడైన ఒక భారతీయ తెలుగు విద్యార్థి ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంలో చిక్కుకున్న తన ముగ్గురు స్నేహితులను ప్రాణాలకు తెగించి కాపాడిన ఆ యువకుడు, చివరకు విధి ఆడిన వింత నాటకంలో నీట మునిగి ప్రాణాలు వదిలాడు. స్నేహితులను ఒడ్డుకు చేర్చినప్పటికీ, నీటి అడుగున ఉన్న చేపల వేట వైర్లలో (Fishing Wire) అతడి కాళ్లు చిక్కుకుపోవడం, నీటి ప్రవాహం బలంగా ఉండటంతో అతడు జలసమాధి అయ్యాడు. అమెరికాలోని టెక్సాస్ మరియు లూసియానా సరిహద్దుల్లో ఉన్న ‘టోలెడో బెండ్ రిజర్వాయర్’ వద్ద ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
మరణించిన భారతీయ విద్యార్థిని అనురూప్ రెడ్డి కోడూరు (22)గా గుర్తించారు. ఆయన ‘యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్’ (University of North Texas) విద్యార్థి. కేవలం కొన్ని వారాల క్రితమే ఆయన సదరు విశ్వవిద్యాలయం నుండి విజయవంతంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తున్న తరుణంలో ఈ ఘోరం జరిగింది
మే 29, 2026 శుక్రవారం మధ్యాహ్నం అనురూప్ రెడ్డి తన స్నేహితులతో కలిసి టోలెడో బెండ్ డ్యామ్ సమీపంలోని స్పిల్‌వే వద్ద ఈత కొట్టడానికి వెళ్లారు. అనురూప్ రెడ్డి మంచి ఈతగాడు (Excellent Swimmer). వీరంతా నీటిలో ఆనందంగా గడుపుతున్న సమయంలో, ఒక్కసారిగా ప్రవాహ తీవ్రత పెరగడంతో అనురూప్ స్నేహితులు ముగ్గురు నీటిలో మునిగిపోతూ ప్రాణాల కోసం కేకలు వేశారు. స్నేహితులు ప్రమాదంలో ఉన్నారని గమనించిన అనురూప్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి అత్యంత సాహసోపేతంగా ఆ ముగ్గురు స్నేహితులను ఒక్కొక్కరిగా సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు.
స్నేహితులను కాపాడిన సంతోషంలో అనురూప్ రెడ్డి కూడా ఒడ్డుకు రావడానికి ప్రయత్నించాడు. కానీ, దురదృష్టవశాత్తూ నీటి అడుగున పారేసి ఉన్న ఒక గట్టి చేపల వేట వైర్ (Fishing Wire) లో అతడి కాళ్లు బలంగా ఇరుక్కుపోయాయి. కాళ్లను విడిపించుకోవడానికి ఆయన ఎంత ప్రయత్నించినప్పటికీ వీలుపడలేదు. అదే సమయంలో డ్యామ్ పరిసరాల్లో నీటి ప్రవాహం (Current) ఒక్కసారిగా బలంగా పెరగడంతో, వైర్లలో చిక్కుకున్న అనురూప్‌ను నీటి ప్రవాహం కిందకు లాగేసింది. ఆయన ఎంతకీ పైకి రాకపోవడంతో ఆందోళన చెందిన స్నేహితులు వెంటనే స్థానిక రక్షణ సిబ్బందికి సమాచారం అందించారు.
స్థానిక సమాచారం అందుకున్న వెంటనే అమెరికాకు చెందిన పలు అత్యవసర సేవా విభాగాలు రంగంలోకి దిగాయి. సౌత్ సాబిన్ ఫైర్ డిస్ట్రిక్ట్, లూసియానా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ అండ్ ఫిషరీస్, నార్త్ సాబిన్ ఫైర్ డిస్ట్రిక్ట్, సాబిన్ రివర్ అథారిటీ, అకాడియన్ అంబులెన్స్, లైఫ్ ఎయిర్ రెస్క్యూ మరియు సాబిన్ పారిష్ షెరీఫ్ డైవ్ టీమ్‌లు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపట్టాయి. కొన్ని గంటల పాటు శ్రమించిన డైవర్ల బృందం, చివరకు నీటి అడుగున దాదాపు 20 అడుగుల లోతులో అనురూప్ రెడ్డి ప్రాణము లేని దేహాన్ని గుర్తించి వెలికితీశారు.
ఈ ఘటనపై సాబిన్ పారిష్ షెరీఫ్ ఆరోన్ మిట్చెల్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. “టెక్సాస్‌లోని డెంటన్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు శుక్రవారం మధ్యాహ్నం టోలెడో బెండ్ డ్యామ్ వద్ద స్నేహితులతో ఈత కొడుతూ నీటిలో మునిగి మరణించాడు. వివిధ రెస్క్యూ బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. మృతుని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా లోతైన సానుభూతిని తెలియజేస్తున్నాము” అని షెరీఫ్ కార్యాలయం పేర్కొంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













