Last Updated:
నమ్మిన వ్యక్తే నట్టేట ముంచడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ భారీ ఆర్థిక మోసానికి సంబంధించి హైదరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు.
Hyderabad: తక్కువ వడ్డీకే భారీ మొత్తంలో విదేశీ రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికి, ఒక గృహిణిని లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు ఆమె నుంచి ఏకంగా రూ.5.64 కోట్లు వసూలు చేసి అదృశ్యమయ్యారు. నమ్మిన వ్యక్తే నట్టేట ముంచడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ భారీ ఆర్థిక మోసానికి సంబంధించి హైదరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన బాధితురాలు ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివసిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ఆమెకు, తన సొంత జిల్లాకే చెందిన ఉప్ప సంతోష్ అనే వ్యక్తితో దాదాపు 20 ఏళ్లుగా పరిచయం ఉంది. ఈ సుదీర్ఘ కాల పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న సంతోష్, ఆమెను ఆర్థికంగా దెబ్బతీయాలని పథకం వేశాడు. గతంలో ఆమెకు రావాల్సిన అప్పు విషయంలో సాయం చేస్తానని నమ్మబలికి, ముంబయికి చెందిన రోనీ రోడ్రిగ్స్ అనే వ్యక్తి ఇలాంటి సెటిల్‌మెంట్లలో దిట్ట అని ఆమెకు పరిచయం చేశాడు.
2021 ఏప్రిల్‌లో సంతోష్, రోనీ రోడ్రిగ్స్ ఇద్దరూ బాధితురాలి ఇంటికి వెళ్లి ఒక భారీ ప్రతిపాదనను ఆమె ముందు ఉంచారు. తమకు విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయని, కేవలం 6 శాతం వడ్డీకే భారీ మొత్తంలో విదేశీ రుణాలు (ECB – External Commercial Borrowing) ఇప్పిస్తామని నమ్మించారు. సుమారు రూ.215 కోట్ల రుణం ఇప్పిస్తామని, దీనికి ఎటువంటి పూచీకత్తు (Collateral) అవసరం లేదని హామీ ఇచ్చారు. అయితే, ఈ రుణం పొందాలంటే సొంతంగా ఒక కంపెనీ ఉండాలని నిబంధన విధించడంతో, వారి సూచన మేరకు బాధితురాలు ‘రాయల్ గుండు గార్మెంట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీలో 95 శాతం వాటాతో చేరారు.
రుణం మంజూరు కావాలంటే ముందస్తుగా పన్నులు, ప్రాసెసింగ్ ఛార్జీల కింద 4.35 శాతం సొమ్ము చెల్లించాలని నిందితులు ఒత్తిడి తెచ్చారు. అంత పెద్ద మొత్తం ఒకేసారి చెల్లించలేనని బాధితురాలు చెప్పడంతో, రుణ మొత్తాన్ని రూ.205 కోట్లకు తగ్గించి, ఛార్జీల మొత్తాన్ని కూడా కొంత సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో వివిధ విడతల్లో బాధితురాలి నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేశారు.
రుణం మంజూరు ప్రక్రియ చివరి దశకు వచ్చిందని, నిధులను తీసుకోవడానికి సింగపూర్ రావాలని నిందితులు ఆమెను కోరారు. 2025 జనవరిలో ఆమె సింగపూర్ వెళ్లగా, అక్కడ రోడ్రిగ్స్, జావేద్ అబ్దుల్ జావేద్ అనే మరో వ్యక్తి ఆమెను కలిశారు. రుణం ఖాతాలో పడిందని నమ్మించి అక్కడ కూడా లక్షల రూపాయలు వసూలు చేశారు. మొత్తం మీద బాధితురాలు సుమారు రూ.5.64 కోట్లు వారి ఖాతాలకు బదిలీ చేశారు. వారం రోజుల్లో రుణం విడుదలవుతుందని చెప్పిన నిందితులు, ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యారు.
మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులైన రోనీ రోడ్రిగ్స్, ఉప్ప సంతోష్, జావేద్‌లపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామనే అపరిచిత వ్యక్తుల మాటలను నమ్మి భారీ మొత్తంలో నగదు చెల్లించవద్దని, ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Hyderabad,Telangana













