Last Updated:
Medical Shops Strike: దాదాపు 12 లక్షల మందికి పైగా కెమిస్టులు, ఫార్మసీలు, డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లు ఈ 24 గంటల సమ్మెలో పాల్గొంటున్నారు. మరి ప్రజల సంగతేంటి?
భారతదేశంలో నేడు బుధవారం (మే 20) నాడు దేశవ్యాప్తంగా రిటైల్, హోల్‌సేల్ మెడికల్ షాపులు బంద్ చేస్తున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపుతో 12.4 లక్షల మందికి పైగా కెమిస్టులు, ఫార్మసీలు, డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లు ఈ 24 గంటల సమ్మెలో పాల్గొంటున్నారు. అందువల్ల రోగుల సాధారణ మందుల కొనుగోళ్లకు అంతరాయం కలిగించవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.
ప్రధాన కారణాలు:
AIOCD ప్రకారం, ఆన్‌లైన్ ఫార్మసీలు (e-pharmacies), కార్పొరేట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కంట్రోల్ లేకుండా మందుల అమ్మకాలు జరుగుతున్నాయి. అవి 20 నుంచి 60 శాతం డిస్కౌంటులు ఇస్తున్నాయి. ఫలితంగా చిన్న మెడికల్ షాపుల వ్యాపారం దెబ్బతింటోందనే ఆరోపణలున్నాయి. పైగా.. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. ఫేక్/AI-జనరేటెడ్ ప్రిస్క్రిప్షన్లకు మందులను అమ్మేస్తున్నారని చిన్న మెడికల్ షాపులు ఆరోపిస్తున్నాయి.
కార్పొరేట్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల గ్రామాల్లో చిన్న చిన్న మందుల షాపుల వారు తమ ఉపాధిని కోల్పోతున్నారనే ఆందోళనలున్నాయి.
AIOCD అధ్యక్షుడు J.S. షిండే, జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ నేతృత్వంలో ఈ సమ్మె జరుగుతోంది. ఇది వాణిజ్య సమస్య మాత్రమే కాదు, రోగి ఆరోగ్య భద్రతకూ సంబంధం ఉందని వారు హెచ్చరించారు. దేశంలోని ఫార్మాస్యూటికల్ ట్రేడ్‌పై ఆధారపడిన 5 కోట్ల మందిపై ఈ సమస్య ప్రభావం చూపుతోందని అంచనా. అందుకే ఇప్పటికే బ్లాక్ బ్యాడ్జ్‌లు ధరించి నిరసన తెలిపిన తర్వాత.. ఈ ఒక్కరోజు బంద్ చేస్తున్నారని సాక్షి రిపోర్ట్ చేసింది.
కేంద్రం స్పందన:
ఈ సమ్మె వల్ల మందుల సరఫరాకి ఎక్కువగా అంతరాయం కలగదని కేంద్రం చెప్పింది. పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి 12 రాష్ట్రాలు/యూటీల్లో సమ్మె ఉండదని కేంద్రం తెలిపింది.
ప్రత్యామ్నాయాలు ఏమిటి?
హాస్పిటల్ ఫార్మసీలు, క్లినికల్ ఫార్మసీలు, ఎమర్జెన్సీ సర్వీసులు సాధారణంగా పనిచేస్తాయి. అత్యవసర మందులు (జీవనరక్షకాలు) కొనుగోలు చేసేందుకు స్థానిక ఏర్పాట్లు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో FDA హెల్ప్‌లైన్లు, ఎమర్జెన్సీ సపోర్ట్ ఉంది. అయినా, రొటీన్ మందుల కొనుగోళ్లకు అసౌకర్యం ఉండొచ్చు.
ఈ సమ్మె ఒక్కరోజు మాత్రమే అయినా, ప్రభుత్వం త్వరగా స్పందించకపోతే మరిన్ని చర్యలు తీసుకుంటామని AIOCD హెచ్చరించింది. ఇది సాంప్రదాయిక మెడికల్ షాపులు vs డిజిటల్ ఎకానమీ మధ్య జరుగుతున్న పోరాటంగా చూడవచ్చు. రోగులు, వినియోగదారులు రెండు వైపులా సమస్యలను గమనించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













