1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద నిర్వహించిన దర్యాప్తు అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు USTR వెల్లడించింది. ఈ దేశాల విధానాలు, చర్యలు అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు భారం కలిగిస్తున్నాయని, అమెరికన్ వ్యాపారాలు మరియు కార్మికులకు నష్టాన్ని కలిగిస్తున్నాయని సంస్థ పేర్కొంది.
ఈ పరిణామం భారత్-అమెరికా మధ్య కీలక వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో వెలుగులోకి రావడం విశేషం. ఇరు దేశాలు ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశను ఖరారు చేసే దిశగా చర్చలు జరుపుతున్నాయి. మార్కెట్ యాక్సెస్, వ్యవసాయం, దిగుమతి సుంకాలు, వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించాయి.
ఈ అంశంపై స్పందించిన USTR రాయబారి జేమిసన్ గ్రీర్, బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతులను అరికట్టడంలో ప్రధాన వాణిజ్య భాగస్వాములు తగిన చర్యలు తీసుకోకపోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ పరిస్థితి అమెరికన్ కార్మికులను ప్రపంచ మార్కెట్లో అసమాన పోటీ పరిస్థితుల్లోకి నెట్టివేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు ఇప్పటికే చర్యలు ప్రారంభించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా బలవంతపు శ్రమను పూర్తిగా అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేశారు.
దర్యాప్తులో ఉన్న దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించాలని USTR ప్రతిపాదించింది. ఇప్పటికే బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతులపై నిషేధం అమలు చేస్తున్న లేదా అలాంటి చర్యలకు అంగీకరించిన దేశాలపై 10 శాతం అదనపు టారిఫ్ విధించే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన దేశాలపై 12.5 శాతం అదనపు సుంకం విధించాలని ప్రతిపాదించింది.
ఈ దర్యాప్తు 2026 మార్చిలో ప్రారంభమైంది. మొత్తం 60 దేశాలు, ఆర్థిక వ్యవస్థలపై విచారణ చేపట్టిన అమెరికా, దాదాపు 60 మంది సాక్షుల వాంగ్మూలాలు, 500కు పైగా అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిశీలించినట్లు వెల్లడించింది.
USTR జాబితాలో భారత్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, మలేషియా, ఖతార్, రష్యా, సౌదీ అరేబియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డమ్, వియత్నాం, థాయ్‌లాండ్, తైవాన్ తదితర దేశాలు ఉన్నాయి. అలాగే కెనడా, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్థాన్ వంటి దేశాలు నిషేధాలను సమర్థవంతంగా అమలు చేయలేదని అమెరికా పేర్కొంది.
అయితే ఇవి ప్రస్తుతం ప్రతిపాదిత చర్యలు మాత్రమే. తుది నిర్ణయం తీసుకునే ముందు అమెరికా ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను స్వీకరించనుంది. జూలై 6 వరకు అభిప్రాయాలను ఆహ్వానించగా, జూలై 7న బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు USTR వెల్లడించింది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే భారత్ సహా పలు దేశాల ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి.












