Last Updated:
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రియురాలు గౌరీ స్ప్రత్‌తో జులై 5న వివాహం జరగనున్నట్లు ప్రచారం సాగుతోంది.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్గా పేరుగాంచిన స్టార్ హీరో అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన తన ప్రియురాలు గౌరీ స్ప్రత్ను త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సమాచారం ప్రకారం, అమీర్ ఖాన్ జులై 5న తన నివాసంలోనే అత్యంత సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరవుతారని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అమీర్ ఖాన్ లేదా ఆయన టీమ్ అధికారికంగా స్పందించలేదు.
గత కొంతకాలంగా అమీర్ ఖాన్, గౌరీ స్ప్రత్ కలిసి పలు కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. ఇటీవల పలు సందర్భాల్లో గౌరీ గురించి అమీర్ ఖాన్ సానుకూలంగా మాట్లాడటం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే, ఇది ఆయనకు మూడో వివాహం అవుతుంది. 1986లో రీనా దత్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్, దాదాపు 16 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత 2002లో విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆ తర్వాత ప్రముఖ దర్శకురాలు, నిర్మాత కిరణ్ రావును 2005లో వివాహం చేసుకున్నారు. ఈ జంట బాలీవుడ్లో ఆదర్శ దంపతులుగా గుర్తింపు పొందింది. అయితే 2021లో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. విడిపోయిన తర్వాత కూడా తమ కుమారుడి కోసం కలిసి బాధ్యతలు నిర్వహిస్తూ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నారు.
ఇప్పుడు గౌరీ స్ప్రత్‌తో అమీర్ ఖాన్ పెళ్లి వార్తలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే బాలీవుడ్లో మాత్రం అమీర్ ఖాన్ మూడో పెళ్లి అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













