Faroe Islands: ఇదేం దిక్కుమాలిన సంప్రదాయం రా బాబు.. వినోదం కోసం 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్ల నరమేధం! | | ACTPnews

PC: Sea Shepherd


Last Updated:

ఒక్క రోజులో దాదాపు 706 డాల్ఫిన్లు, పైలట్ తిమింగలాలను అత్యంత దారుణంగా వేటాడి చంపేశారు. స్థానికంగా ‘గ్రిందాడ్రాప్’ (Grindadráp) లేదా ‘గ్రిండ్’ అని పిలిచే ఈ వార్షిక వేట సాగర తీరాన్ని రక్తాసిక్తం చేసింది.

PC: Sea Shepherd
PC: Sea Shepherd

Faroe Islands: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని డెన్మార్క్ స్వయంప్రతిపత్తి ప్రాంతమైన ‘ఫారో దీవుల్లో’ (Faroe Islands) మానవత్వమే సిగ్గుపడేలా ఒక అనాగరిక ఘోరం వెలుగుచూసింది. శతాబ్దాల నాటి వైకింగ్ కాలం నాటి క్రూరమైన సాంప్రదాయం పేరిట ఒకే ఒక్క రోజులో దాదాపు 706 డాల్ఫిన్లు, పైలట్ తిమింగలాలను అత్యంత దారుణంగా వేటాడి చంపేశారు. స్థానికంగా ‘గ్రిందాడ్రాప్’ (Grindadráp) లేదా ‘గ్రిండ్’ అని పిలిచే ఈ వార్షిక వేట సాగర తీరాన్ని రక్తాసిక్తం చేసింది.

వన్యప్రాణి సంరక్షణ సంస్థ ‘సీ షెపర్డ్’ (Sea Shepherd) అందించిన సమాచారం ప్రకారం.. గత ఏడాది మొత్తం చంపబడిన సముద్ర క్షీరదాల సంఖ్యలో మూడింట రెండు వంతుల జీవులను కేవలం ఒక్క రోజులోనే నరికి చంపారు. ఈ భీభత్సానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

సముద్రాన్ని ముంచెత్తిన రక్తం.. జీవుల విలవిల

చిన్న బోట్లలో వెళ్లిన వేటగాళ్లు వందలాది డాల్ఫిన్లు, తిమింగలాల గుంపును చుట్టుముట్టి, వాటిని బలవంతంగా తీరంలోని లోతు తక్కువ జలాల్లోకి నెట్టారు. అక్కడికి చేరిన స్థానికులు పదునైన హుక్స్, పొడవైన కత్తులతో వాటిపై దాడి చేశారు. ఈ దారుణ కాండతో ఆ సముద్రపు అఖాతం మొత్తం జీవుల రక్తంతో ఎర్రగా మారిపోయింది.

అయితే, ఈసారి వేట తీవ్ర గందరగోళం, క్రూరత్వంతో కూడుకుని సాగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జంతువులను త్వరగా చంపి వాటి బాధను తగ్గించడానికి ఉపయోగించే చట్టబద్ధమైన ‘స్పైనల్ లాన్స్’ (Spinal Lances) అనే ప్రత్యేక పరికరాల కొరత ఉండటంతో, వేటగాళ్లు సాధారణ కత్తులతోనే వాటిని విచక్షణారహితంగా నరికారు. దీనివల్ల ఆ మూగజీవులు తక్షణమే చనిపోక, తీవ్ర నొప్పితో, శ్వాస ఆడక గంటల తరబడి విలవిలలాడుతూ ప్రాణాలు విడిచాయి. మరికొన్ని జీవులు బోట్ల ప్రొపెల్లర్లకు చిక్కుకుని, బండరాళ్లకు ఢీకొని ఛిద్రమయ్యాయి.

చట్టాన్ని మార్చేసిన పార్లమెంట్.. నిరసనకారుల అరెస్ట్

ఈ దారుణానికి కొన్ని గంటల ముందే ఫారో దీవుల పార్లమెంట్ ఏకగ్రీవంగా ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. డాల్ఫిన్లు, తిమింగలాల వేటను జంతు సంరక్షణ చట్టాల (Animal Welfare Laws) పరిధి నుంచి మినహాయిస్తూ చట్టాన్ని సవరించింది. దీనివల్ల వేటగాళ్లపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.

ఈ క్రూరత్వాన్ని రికార్డు చేయడానికి ప్రయత్నించిన ‘సీ షెపర్డ్’ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. తమ సాంప్రదాయాన్ని ప్రపంచానికి చూపించకుండా కప్పిపుచ్చడానికే ప్రభుత్వం ఈ అరెస్టులకు పాల్పడిందని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు.

ఆహారం కోసం కాదు.. కేవలం వినోదం కోసమే!

పదహారో శతాబ్దంలో (వైకింగ్ కాలంలో) అక్కడ పంటలు పండని కఠిన వాతావరణం ఉండటం వల్ల, కేవలం ఆహారం కోసం మాత్రమే స్థానికులు ఈ వేటను ప్రారంభించారు. కానీ నేడు ఫారో దీవులు ప్రపంచంలోనే అత్యధిక జీవన ప్రమాణాలు కలిగిన ధనిక ప్రాంతాలలో ఒకటిగా మారాయి. సూపర్ మార్కెట్లు, అన్ని రకాల ఆహార వసతులు ఉన్నప్పటికీ, కేవలం ‘సంప్రదాయం, వినోదం’ పేరిట ప్రతి ఏటా వందలాది అమాయక సముద్ర జీవులను ఇలా నరికి చంపడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports