US-Israel: ట్రంప్ యంత్రాంగంపై ఇజ్రాయెల్ గూఢచర్యం? పెంటగాన్ సంచలన నిర్ణయం! | | ACTPnews

ట్రంప్, నేతన్యాహూ


Last Updated:

ఇరాన్, లెబనాన్ యుద్ధ వ్యూహాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య తీవ్ర విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది.

ట్రంప్, నేతన్యాహూ
ట్రంప్, నేతన్యాహూ

US-Israel: ఇరాన్‌పై ఉమ్మడి సైనిక దాడి చేసిన కొద్ది నెలలకే.. అత్యంత సన్నిహిత మిత్రదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్’, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తన కౌంటర్ ఇంటెలిజెన్స్ ముప్పు అంచనాను అత్యంత ప్రమాదకరమైన “క్రిటికల్” స్థాయికి పెంచినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ ‘ఎన్‌బీసీ న్యూస్’ వెల్లడించింది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించే వ్యూహాలపై వాషింగ్టన్, టెల్ అవీవ్ ల మధ్య తలెత్తిన తీవ్ర భేదాభిప్రాయాల నేపథ్యంలో అమెరికా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

అమెరికా రక్షణ నిఘా సంస్థ (DIA) ఇటీవల జారీ చేసిన అంతర్గత నివేదికలో ఈ మార్పులను స్పష్టం చేసినట్లు ఇద్దరు ప్రస్తుత అమెరికా అధికారులు, ఒకరు మాజీ అధికారి ధృవీకరించారు.

ట్రంప్ యంత్రాంగంపై ఇజ్రాయెల్ కన్ను?

మధ్యప్రాచ్య (Middle East) సంక్షోభంపై ట్రంప్ యంత్రాంగం లోపల జరుగుతున్న అంతర్గత చర్చలు, వారు తీసుకోబోయే నిర్ణయాలను ముందే పసిగట్టేందుకు.. అమెరికా ఉన్నతాధికారులను ఇజ్రాయెల్ టార్గెట్ చేసి నిఘా పెడుతోందనే అనుమానాలు పెంటగాన్‌లో బలంగా వ్యక్తమవుతున్నాయి. డీఐఏ (DIA) రూపొందించిన 7 పేజీల రహస్య నివేదిక ప్రకారం.. మానవ వనరుల ద్వారా నిఘా పెట్టడం (Human Intelligence), సాంకేతిక సమాచారాన్ని దొంగిలించడం (Technical Collection) వంటి అంశాలలో ఇజ్రాయెల్ సామర్థ్యం ఇప్పుడు అమెరికాకు ఒక సవాల్‌గా, “క్రిటికల్ స్థాయి”కి చేరిందని పేర్కొంది.

ఆరోపణలను ఖండించిన ఇజ్రాయెల్

అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి స్పందిస్తూ.. ఈ నివేదిక పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. “ఇజ్రాయెల్ అమెరికా సంస్థలపై గానీ, అమెరికా ప్రభుత్వ అధికారులపై గానీ ఎలాంటి నిఘా పెట్టదు. మా నిఘా వ్యవస్థలన్నీ శత్రు దేశాలపైనే ఉంటాయి తప్ప మిత్రదేశాలపై కాదు” అని స్పష్టం చేశారు. మరోవైపు ఈ నివేదికపై స్పందించేందుకు పెంటగాన్ నిరాకరించగా, వైట్ హౌస్ అధికారి ఒకరు కూడా ఈ కథనాన్ని తోసిపుచ్చారు.

ట్రంప్ – నెతన్యాహు మధ్య పెరిగిన దూరం

ఇరాన్ మరియు లెబనాన్ యుద్ధ వ్యూహాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య తీవ్ర విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఈ వారం ఇద్దరు నేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందని, ఆ సమయంలో తాను నెతన్యాహును ‘క్రేజీ’ (పిచ్చివాడు) అని అన్నట్లు ట్రంప్ స్వయంగా అంగీకరించారు.

ఏప్రిల్ ప్రారంభంలో కుదిరిన కాల్పుల విరమణ (Ceasefire) తర్వాత, ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్ యుద్ధాన్ని దౌత్యపరమైన చర్చల ద్వారా ముగించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇరాన్ చర్చలకు కట్టుబడి ఉంటుందనే నమ్మకం లేదని ఇజ్రాయెల్ బహిరంగంగానే అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇరాన్‌పై మళ్లీ బాంబు దాడులు చేయాలని నెతన్యాహు గట్టిగా పట్టుబడుతున్నారు. అలాగే లెబనాన్‌లోని హిజ్బుల్లాపై దాడులను తగ్గించాలన్న ట్రంప్ సూచనలను ఇజ్రాయెల్ తోసిపుచ్చుతోంది.

రూమ్స్‌లో మాట్లాడాలన్నా భయం.. అప్రమత్తమైన అమెరికా అధికారులు

ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లే అమెరికా ఉన్నతాధికారులు ముందే అదనపు భద్రతా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ చాలా దూకుడుగా సమాచారాన్ని సేకరిస్తుందని, అందుకే అక్కడికి వెళ్లే ప్రతినిధులు ప్రత్యేకమైన బర్నర్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఉపయోగిస్తారని సమాచారం. హోటల్ గదుల్లో మాట్లాడేటప్పుడు కూడా వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

దశాబ్దాలుగా ఇరు దేశాల నిఘా సంస్థలు కలిసి పనిచేస్తున్నప్పటికీ, ఇరాన్ వివాదం నడుస్తున్న ఈ కీలక సమయంలో ఇలాంటి గూఢచర్య అనుమానాలు రావడం ఇరు ప్రభుత్వాల మధ్య ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *