Last Updated:
హైదరాబాద్‌లో ఇదేం పరిస్థితి రా దేవుడా.. మెట్రో స్టేషన్ల ముందు ఈ క్యూ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి!
హైదరాబాద్ నగరంలో జూన్ 9 సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. ఏకధాటిగా కురిసిన కుండపోత వానతో రోడ్లన్నీ నదులను తలపించాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో సురక్షితంగా ఇళ్లకు చేరుకోవడానికి నగరవాసులు ప్రత్యామ్నాయంగా మెట్రో రైళ్లను ఆశ్రయించారు. దీంతో నగరంలోని పలు మెట్రో స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. స్టేషన్ల బయట కిలోమీటర్ల మేర బారులు తీరిన జనాన్ని చూస్తే ఇది తిరుమల క్యూ లైనా అని ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ స్థాయిలో నిన్న మెట్రో స్టేషన్ల వద్ద అనూహ్యమైన రద్దీ నెలకొంది.
సాయంత్రం ఆఫీసులు వదిలే సమయానికి ఒక్కసారిగా వాన దంచికొట్టడం ఈ విపరీతమైన రద్దీకి ప్రధాన కారణం. మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ఐటీ కారిడార్ ప్రాంతాలతో పాటు నగరంలోని పలు జంక్షన్లలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. క్యాబ్ లు, ఆటోలు బుక్ చేసుకున్నా కదలలేని దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ సొంత వాహనాల్లో వెళ్దామన్నా రోడ్లపై మోకాల్లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇళ్లకు చేరుకోవడానికి ఏకైక సురక్షిత మార్గంగా అందరికీ మెట్రో మాత్రమే కనిపించింది. దీంతో వందలాది మంది ఒక్కసారిగా దగ్గర్లోని స్టేషన్లకు పోటెత్తారు.
మెట్రో స్టేషన్ల లోపల అడుగుపెట్టే పరిస్థితి ఏమాత్రం లేకపోవడంతో ప్రయాణికులు మెట్ల మీద, రోడ్ల పక్కన గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. టోకెన్లు తీసుకునే కౌంటర్ల వద్ద పెద్ద ఎత్తున తోపులాటలు జరిగాయి. ప్లాట్ ఫారాలు కూడా పూర్తిగా నిండిపోవడంతో భద్రతా సిబ్బంది ప్రయాణికులను నియంత్రిస్తూ విడతల వారీగా లోపలికి అనుమతించారు. రైలు రాగానే ఎక్కడానికి జనం తీవ్రంగా పోటీ పడటంతో బోగీల లోపల ఊపిరి సలపని పరిస్థితి నెలకొంది. ఏ స్టేషన్ చూసినా ఇసుకేస్తే రాలనంత జనం కనిపించడంతో అధికారులు సైతం ఈ పరిస్థితిని చూసి అవాక్కయ్యారు.
ఆఫీసులో రోజంతా కష్టపడి అలిసిపోయిన ఉద్యోగులకు ఈ భారీ క్యూ లైన్లలో నిలబడటం నరకాన్ని తలపించింది. కొందరు గంటకు పైగా లైన్లలో నిలుచోలేక తీవ్ర అసహనానికి గురయ్యారు. అయినప్పటికీ వరద నీటిలో రోడ్ల మీద గంటల కొద్దీ ట్రాఫిక్‌లో నరకయాతన అనుభవించే బదులు క్యూలో నిలబడటమే ఉత్తమమని చాలా మంది సర్దుకుపోయారు. వర్షం తగ్గేలా కనిపించకపోవడంతో ఎంత రద్దీ ఉన్నా సరే మెట్రోలోనే ప్రయాణించడానికి అందరూ ప్రాధాన్యం ఇచ్చారు. వృద్ధులు, మహిళలు ఈ రద్దీలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నిన్నటి భారీ వర్షం నగరంలో మెట్రో రైలు వ్యవస్థ ఆవశ్యకతను నగరవాసులకు మరోసారి స్పష్టంగా గుర్తుచేసింది. అత్యవసర విపత్తుల సమయంలో హైదరాబాద్ ప్రజలకు మెట్రో ఒక జీవనాడిగా నిలుస్తుందని నిన్నటి ఘటనే తెలియజేస్తోంది. అయితే భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అదనపు రైళ్లు నడపాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా నిన్నటి మెట్రో క్యూ లైన్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.
Hyderabad,Telangana













