Last Updated:
ఒక్కరోజే రూ.4 కోట్ల ఆదాయం.. పోటెత్తిన భక్తులు.. అదే సమయంలో స్వామివారి సేవలో హీరోయిన్ సమంత!
కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల కోలాహలం నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. సామాన్య భక్తులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఆపదమొక్కుల వాడిని దర్శించుకుని తరిస్తుంటారు. ముఖ్యంగా తమ కొత్త చిత్రాలు విడుదలకు సిద్ధమైనప్పుడు అవి ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అగ్ర తారలు ముందుగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ కథానాయిక సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ నటి శ్రీముఖి, ‘మాఇంటి బంగారం’ సినిమా బృందంతో కలిసి సమంత శ్రీవారి ఆలయానికి విచ్చేశారు. భక్తిశ్రద్ధలతో వీరంతా స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఈ చిత్ర బృందానికి వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు వారికి స్వామివారి పవిత్ర తీర్థప్రసాదాలు అందజేసి సాంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలతో ఘనంగా సత్కరించారు.
దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో సమంత ముచ్చటించారు. రేపు అనగా 19వ తేదీన తాము నటించిన ‘మాఇంటి బంగారం’ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని ఆమె తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులను అలరించి మంచి విజయం సాధించాలని మనసారా శ్రీవారిని ప్రార్థించినట్లు ఆమె వెల్లడించారు. తమ అభిమాన నటీమణులు సమంత, శ్రీముఖిలను అక్కడ చూసిన భక్తులు ఆనందంతో వారి దగ్గరకు వెళ్లేందుకు ఆసక్తి చూపించారు. వారితో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహంగా పోటీపడటంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే తిరుమల కొండపై భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 82,438 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 39,948 మంది తలనీలాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. హుండీ కానుకల రూపంలో శ్రీవారికి రూ.4.24 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ఎలాంటి టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి కనీసం 10 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు అధికారికంగా పేర్కొన్నారు.
భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. నిన్న ఒక్కరోజే 4.16 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించారు. అలాగే అన్నప్రసాద కేంద్రాల ద్వారా 2.14 లక్షల మందికి కడుపునిండా భోజన సదుపాయం కల్పించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించారు. అనారోగ్యానికి గురైన వారికి తక్షణం స్పందించి ఏకంగా 3,052 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Tirumala,Chittoor,Andhra Pradesh












