Opinion | తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్: బీసీ అస్త్రంతో కాషాయ దండు.. మోదీ మదిలో మాస్టర్ ప్లాన్ ఇదేనా? | తెలంగాణ వార్తలు | ACTPnews

Opinion | తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్: బీసీ అస్త్రంతో కాషాయ దండు.. మోదీ మదిలో మాస్టర్ ప్లాన్ ఇదేనా? | తెలంగాణ వార్తలు


అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయోత్సాహంలో ఉన్న సమయంలో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టడం వెనక కేవలం రాజకీయ స్టేట్మెంట్ మాత్రమే కాకుండా, దీర్ఘకాల వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేసీఆర్‌తో జరిగిన రాజకీయ పోరాటాన్ని మళ్లీ ప్రజల్లో గుర్తుచేస్తూ, ఈసారి తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామనే సంకేతాన్ని కార్యకర్తలకు మోదీ స్పష్టంగా ఇచ్చారు.

అయితే ఈ సభకు ముందు రోజు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారం చుట్టూ జరిగిన రాజకీయ అలజడి నేపథ్యంలో సభలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులకు అవకాశం ఇవ్వకుండా సభను విజయవంతంగా ముగించడం బీజేపీ ఆర్గనైజేషనల్ సామర్థ్యానికి నిదర్శనంగా మారింది. అయితే ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఒకప్పుడు పార్టీకి దూకుడు తెచ్చిన బండి సంజయ్ ఇప్పుడు వివాదాల మధ్య చిక్కుకోవడం, కార్యకర్తల్లో కొంత ఆందోళనకు దారితీసింది. పార్టీ గ్రాఫ్ మళ్లీ పడిపోతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణ బీజేపీ పూర్తి భిన్నంగా కనిపించింది. వరుస సభలు, పాదయాత్రలు, ఉద్యమాత్మక రాజకీయాలతో పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చారు. అప్పటివరకు పరిమిత స్థాయిలో ఉన్న బీజేపీని ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలబెట్టడంలో ఆయన పాత్ర కీలకమైంది. కానీ అధ్యక్ష పదవి మారిన తర్వాత అదే దూకుడు కనిపించలేదనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.

ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావ్ నేతృత్వంలో పార్టీ మళ్లీ పాత శైలిలోకి వెళ్లిందనే విమర్శలు ఉన్నాయి. “డీసెంట్ అండ్ హంబుల్” రాజకీయాలకు మాత్రమే పరిమితమైందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడైన పోరాటం చేయడం లేదనే అసంతృప్తి కేడర్‌లో కనిపిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్రంతో ఘర్షణకు దూరంగా ఉండటం వల్ల రాష్ట్రంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష రాజకీయ యుద్ధం కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ పరిస్థితులు శాశ్వతం కావని, ఎన్నికల సమయానికి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని బీజేపీ అగ్రనేతలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే “బీసీ ఫాక్టర్”నే ప్రధాన ఆయుధంగా ఉపయోగించాలనే వ్యూహం పార్టీ మదిలో ఉందనే చర్చ బలంగా వినిపిస్తోంది. రాష్ట్రంలో బీసీ వర్గాల ఓటు బ్యాంక్ నిర్ణయాత్మకంగా ఉండటంతో “బీసీ సీఎం” నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేంద్ర పేరు బలంగా వినిపిస్తోంది. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, మృదుస్వభావం, అన్ని వర్గాల్లో ఆమోదయోగ్యత, క్లీన్ ఇమేజ్ ఈటల రాజేందర్‌కు ఉన్న ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి. గతంలో కేసీఆర్ కుటుంబంతో జరిగిన విభేదాలు, మంత్రి పదవి నుంచి బయటకు రావడం వల్ల ఆయనకు వచ్చిన సానుభూతి కూడా బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉందని అంచనా. ఫైనాన్స్, హెల్త్ శాఖలను నిర్వహించిన అనుభవం ఉండటం వల్ల పరిపాలనా పరంగా కూడా ఈటల బలమైన నాయకుడిగా నిలుస్తున్నారు. బీసీ సమీకరణాల్లో మరో పేరు ధర్మపురి అర్వింద్ అయినప్పటికీ, ప్రస్తుతం సీఎం ఫేస్ రేసులో ఈటలకే అధిక ఆధిక్యం కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించే ఆలోచన కూడా బీజేపీ పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి: CM Vijay: సీఎం కుర్చీ దక్కినా పవర్ పోయిందా?.. విజయ్ చేసి 5 పొరపాట్లు ఇవేనా?

అలా జరిగితే ప్రస్తుతం బలహీనపడుతున్న కేటీఆర్, కవిత చుట్టూ నెలకొన్న కుటుంబ అంతర్గత విభేదాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల వలసలు పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ భవిష్యత్తు కోసం చూస్తున్న ప్రాంతీయ నేతలకు ఈటల రాజేందర్ బీజేపీ వైపు ఆకర్షించే ముఖచిత్రంగా మారవచ్చని అంచనా.

ఇక మోదీ వ్యూహంలో మరో కీలక అంశం “సైలెంట్ గ్రౌండ్ బిల్డింగ్”గా కనిపిస్తోంది. ఇప్పుడే ప్రభుత్వం మీద అతిగా దాడి చేయకుండా, ఎన్నికల సమయానికి ఒక్కసారిగా దూకుడు పెంచి ప్రత్యక్ష పోరాటంలోకి వెళ్లాలనే ప్లాన్ ఉండొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో బీసీలు, యువత, హిందుత్వ ఓటు బ్యాంక్, పట్టణ మధ్యతరగతి వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురాగలిగితే తెలంగాణలో బీజేపీ భారీగా ఎదిగే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Cockroach Janata Party: బొద్దింకల జనతా పార్టీ నిజంగానే రాజకీయ పార్టీగా మారుతుందా? బరిలోకి దిగితే ఏమవుతుంది?

అయితే తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ సింపుల్‌గా ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం యాంటీ ఇంకంబెన్సీని ఎలా ఎదుర్కొంటుంది, బీఆర్ఎస్ ఎంతవరకు పునరుద్ధరణ సాధిస్తుంది, బీజేపీ అంతర్గత విభేదాలను ఎలా నియంత్రిస్తుంది అనే అంశాలపై భవిష్యత్ సమీకరణాలు ఆధారపడి ఉంటాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి తెలంగాణను బీజేపీ కేవలం రాజకీయ ప్రయోగ రాష్ట్రంగా కాకుండా, దక్షిణాదిలో కీలక ద్వారంగా చూస్తోంది. పూర్తి మెజారిటీ సాధించకపోయినా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలపై కమలం పార్టీ గట్టి లెక్కలు వేస్తోందనే సంకేతాలు ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports