Last Updated:
సిటీలో ఉంటున్న వారికి అదిరే గుడ్ న్యూస్. ఎందుకంటే భారీ డిస్కౌంట్ ఆఫర్లు వచ్చేశాయి. సీజనల్ సేల్ నడుస్తోంది.
భాగ్యనగర వాసులకు తీపికబురు. ఫ్యాషన్ ప్రియులకు పండుగ వాతావరణం వచ్చేసింది. బ్రాండెడ్ దుస్తులను ఆకర్షణీయమైన ధరలకు సొంతం చేసుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ప్రారంభమైంది. జూన్ మధ్య నుంచి ఆగస్టు మధ్య వరకు కొనసాగే ఈ సేల్.. బడ్జెట్ దాటకుండా వార్డ్రోబ్ను కొత్త దుస్తులతో నింపుకునేందుకు అద్భుతమైన అవకాశం. స్టైలిష్ వెస్ట్రన్ వేర్, సంప్రదాయ దుస్తులు, స్పోర్ట్స్ వేర్, పాదరక్షలు, ఫ్యాషన్ ఉపకరణాలతో పాటు మరెన్నో వస్తువులు డిస్కౌంట్లలో లభిస్తుండటంతో.. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్స్ అన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడేందుకు సిద్ధమయ్యాయి. ఈ సీజన్లో మీకు ఇష్టమైన బ్రాండ్లను తక్కువ ధరలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు.
నగరంలో పలు పాపులర్ బ్రాండ్లు ఇప్పటికే తమ ఆఫర్లను ప్రకటించగా, మరికొన్ని రాబోయే రోజుల్లో సేల్ ప్రారంభించనున్నాయి. హెచ్ అండ్ ఎమ్ (H&M) ఆఫర్లు ఇప్పటికే లైవ్‌లో ఉండగా.. రాబోయే రోజుల్లో భారీ డిస్కౌంట్లు రానున్నాయి. లైఫ్‌స్టైల్ జూన్ 26 నుంచి జూలై 31 వరకు క్యాజువల్ వేర్, పాదరక్షలపై 20 నుంచి 50 శాతం వరకు రాయితీ ఇస్తోంది. ప్యాంటలూన్స్ జూన్ 25 నుంచి జూలై నెలాఖరు వరకు ఎత్నిక్ వేర్, పిల్లల దుస్తులపై 10 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. షాపర్స్ స్టాప్‌లో జూన్ 20 నుంచి జూలై 14 వరకు ప్రీమియం ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై 50 శాతం వరకు ఆఫర్లు ఉన్నాయి. జారా జూన్ 27 నుంచి సీజనల్ కలెక్షన్స్‌పై 50 శాతం ఆఫర్ ప్రకటించగా.. యూనిక్లో సేల్ జూన్ 27న మొదలైంది. మార్క్స్ అండ్ స్పెన్సర్ (M&S) జూలై అంతటా 50 శాతం రాయితీ ఇస్తుండగా, జూడియో జూలై 1 నుంచి సేల్ మొదలుపెట్టింది. లీవైస్, జాక్ అండ్ జోన్స్ డెనిమ్ వేర్‌పై సగం ధరకే దుస్తులు అందిస్తుండగా.. వెస్ట్‌సైడ్ ఆగస్టు 1 నుంచి 31 వరకు సేల్ నిర్వహించనుంది.
ఫ్యాషన్ దుస్తులతో పాటు స్పోర్ట్స్ వేర్, ఇంటి అలంకరణ వస్తువులపై కూడా భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అడిడాస్ జూలై 1 నుంచి 7 వరకు అథ్లెజర్, స్నీకర్లపై 30 నుంచి 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ప్యూమా జూలై 1 నుంచి 5 వరకు స్పోర్ట్స్ వేర్‌పై 30-50 శాతం రాయితీ ఇస్తోంది. రీబాక్ బ్రాండ్ కూడా తన స్నీకర్లపై 50 శాతం వరకు తగ్గింపు అందిస్తుండగా, నైక్ బ్రాండ్ సేల్ జూన్ నెలాఖరున ప్రారంభం కానుంది. ఫ్యాషన్ ప్రపంచాన్ని దాటి చూస్తే.. హోమ్ సెంటర్ తమ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. క్రీడాకారులకు ఎంతో ఇష్టమైన డెకాథ్లాన్ తమ స్పోర్ట్స్ గేర్‌పై ఏకంగా 60 శాతం వరకు అద్భుతమైన రాయితీలు కల్పిస్తోంది.
ఈ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రధాన షాపింగ్ మాల్స్ అన్నీ కొనుగోలుదారులతో సందడిగా మారనున్నాయి. కూకట్‌పల్లిలోని నెక్సస్ హైదరాబాద్ మాల్, శరత్ సిటీ క్యాపిటల్ మాల్, ఇన్ ఆర్బిట్ మాల్, జీవీకే వన్ మాల్, హైదరాబాద్ సెంట్రల్ మాల్స్‌లో ఈ సేల్ హడావుడి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నెక్సస్ హైదరాబాద్ మాల్ జూన్ 13 నుంచి ఆగస్టు 16 వరకు తమ ఇన్-హౌస్ బ్రాండ్లపై గరిష్టంగా 50 శాతం వరకు బంపర్ ఆఫర్లు అందిస్తోంది. ప్రతి వారాంతంలో ఈ మాల్స్ అన్నీ షాపింగ్ చేసేవారితో కిక్కిరిసిపోతాయి. వీధి వ్యాపారాలు, హై స్ట్రీట్ మార్కెట్లలో సైతం ఈ సందడి వాతావరణం నెలకొంది.
ఈ ప్రత్యేకమైన సేల్‌లో బెస్ట్ డీల్స్, మనకు సరిపోయే సైజులు కేవలం మొదటి కొద్ది రోజుల్లోనే అమ్ముడవుతాయి. కాబట్టి స్మార్ట్‌గా షాపింగ్ చేయడం చాలా ముఖ్యం. వారాంతాల్లో కాకుండా పనిదినాల్లో (వీక్ డేస్) షాపింగ్ చేస్తే రద్దీ తక్కువగా ఉండి ప్రశాంతంగా దుస్తులు ఎంచుకోవచ్చు. దుకాణాలకు వెళ్లే ముందు ఆన్లైన్లో ధరలు పోల్చి చూసుకోవడం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై ఉన్న బ్యాంక్ ఆఫర్లను పరిశీలించడం ద్వారా అదనపు డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన ధరలకు కొత్త బట్టలు, స్నీకర్లు, ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ అతిపెద్ద ఫ్యాషన్ సేల్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి.
Hyderabad,Telangana













