చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో నెలకు రూ.2 లక్షల సంపాదన.. ఏఐతో అద్భుతాలు సృష్టిస్తున్న 13 ఏళ్ల కుర్రాడు! | బిజినెస్ | ACTPnews

చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో నెలకు రూ.2 లక్షల సంపాదన.. ఏఐతో అద్భుతాలు సృష్టిస్తున్న 13 ఏళ్ల కుర్రాడు!


Last Updated:

రీల్స్ చూసే వయసులో లక్షలు సంపాదిస్తున్నాడు.. ఈ 8వ తరగతి పిల్లాడి టాలెంట్ తెలిస్తే ఐటీ ఉద్యోగులు కూడా అసూయపడతారు!

చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో నెలకు రూ.2 లక్షల సంపాదన.. ఏఐతో అద్భుతాలు సృష్టిస్తున్న 13 ఏళ్ల కుర్రాడు!
చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో నెలకు రూ.2 లక్షల సంపాదన.. ఏఐతో అద్భుతాలు సృష్టిస్తున్న 13 ఏళ్ల కుర్రాడు!

ఉదయం నిద్రలేవగానే సెల్ ఫోన్ పట్టుకుని రీల్స్ చూస్తూ సమయం వృథా చేసే యువత ఉన్న ఈ రోజుల్లో, కేవలం 13 ఏళ్ల వయసులో ఓ 8వ తరగతి కుర్రాడు టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఫోన్‌లో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేసే స్థాయి నుంచి, అదే ఫోన్ సాయంతో నెలకు దాదాపు రెండు లక్షల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగాడు. అతడే హైదరాబాద్‌కు చెందిన వైభవ్. నారాయణ స్కూల్‌లో చదువుతున్న ఈ చిన్నోడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నేర్చుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వేసవి సెలవుల్లో సరదాగా ప్రారంభించిన ఈ ఏఐ ప్రయాణం నేడు అతన్ని చిన్న వయసులోనే ఒక వ్యాపారవేత్తగా నిలబెట్టింది. టెక్నాలజీని సరైన మార్గంలో వాడుకుంటే వయసుతో పనిలేకుండా అఖండ విజయాలు సాధించవచ్చని ఈ కుర్రాడు నిరూపిస్తున్నాడు.

న్యూస్18 ప్రతినిధి మస్తాన్ వలీతో ఫోన్ కాల్ ద్వారా వైభవ్ పలు అంశాలను వెల్లడించారు. సాధారణ విద్యార్థుల్లాగే వైభవ్ కూడా సెలవుల్లో తన యూట్యూబ్ ఛానెల్ ను ఎలా అభివృద్ధి చేయాలి, ఆకర్షణీయమైన థంబ్‌నెయిల్స్ ఎలా తయారు చేయాలి అనే విషయాలు తెలుసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోలు చూసేవాడు. ఆ సమయంలో అతడికి సూపర్ ఏఐ అకాడమీ నిర్వహిస్తున్న ఓ ఏఐ కోర్సు ప్రకటన కనిపించింది. నాన్న నాగేశ్వరరావు ప్రోత్సాహంతో కేవలం 4,999 రూపాయల ఫీజుతో ఆ కోర్సులో చేరాడు. తన మెంటర్ నిఖీలు గుండా మార్గదర్శకత్వంలో క్లాసులు శ్రద్ధగా విన్నాడు. గురువు చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని ప్రాక్టికల్ గా ఆచరణలో పెట్టి చూశాడు. అలా కేవలం 21 రోజుల్లోనే ఏఐ టూల్స్ వాడటంలో పూర్తి ప్రావీణ్యం సంపాదించాడు. రోజూ తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి ఏఐకి నాలుగు గంటలు, తన స్కూల్ హోమ్‌వర్క్ కు మూడు గంటలు కేటాయించడం అలవాటు చేసుకున్నాడు.

తొలుత సరదాగా ఏఐ వీడియోలు తయారు చేసి వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకునేవాడు. అది చూసిన ఓ బంధువు ఆర్ఐపీ వీడియో చేయమని అడగడంతో అతడి సంపాదన ప్రయాణం మొదలైంది. ఆ వీడియోకు అనూహ్య స్పందన రావడంతో స్థానికంగా చాలా మంది వీడియోలు చేసివ్వాలని అడగడం ప్రారంభించారు. అలా తొలి వీడియో చేసినందుకు 7 వేల రూపాయలు సంపాదించాడు. ఆ తర్వాత వీడియో జనరేషన్ కోసం తన సంపాదనతోనే గ్రాక్ అనే టూల్ కొనుగోలు చేశాడు. చదువులో కూడా ఏఐని ఓ మంచి స్నేహితుడిగా వాడుకుంటున్నాడు. చాట్‌జీపీటీ, నోట్‌బుక్ ఎల్ఎమ్ టూల్స్ సాయంతో కష్టమైన మ్యాథ్స్ చాప్టర్లను పాడ్‌కాస్ట్‌లుగా మార్చుకుని చాలా సులభంగా అర్థం చేసుకుంటున్నాడు.

వైభవ్ ప్రతిభ స్థానికంగా ఉన్న వ్యాపారులకు తెలియడంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావడం మొదలైంది. ఒక ఫర్నీచర్ షాపు యజమాని ఏఐ ప్రమోషన్స్ కోసం 80 వేల రూపాయల ప్రాజెక్ట్ అప్పగించాడు. రోజురోజుకూ కస్టమర్ల సంఖ్య పెరిగిపోతుండటంతో వైభవ్ కు ఫోన్ కాల్స్ వెల్లువలా రావడం మొదలైంది. వాటిని నిర్వహించడానికి ఏకంగా ఓ ఏఐ కాల్ ఏజెంట్‌ను అతడు సెట్ చేసుకున్నాడు. ఈ ఏజెంట్ నేరుగా కస్టమర్లతో మాట్లాడి, అందులో అత్యంత ముఖ్యమైన కాల్స్ మాత్రమే వైభవ్‌కు బదిలీ చేస్తుంది. ఇదంతా కేవలం స్మార్ట్‌ఫోన్ ద్వారానే చేస్తుండటం విశేషం. నైపుణ్యాలు పెంచుకోకపోవడం వల్లే ప్రస్తుతం ఐటీ రంగంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారని ఈ చిన్నారి విశ్లేషిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ కుర్రాడు ఏఐ సాయంతో సినిమాటిక్ వీడియోలు రూపొందిస్తూ వివిధ వ్యాపార సంస్థలకు అద్భుతమైన సోషల్ మీడియా ప్రమోషన్ సేవలు అందిస్తున్నాడు. బంగారు నగల దుకాణాలు, ఫర్నిచర్ షోరూమ్స్, రెస్టారెంట్లు, బ్యూటీ పార్లర్లు, పలు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లు, చిన్న తరహా వ్యాపారాలకు ప్రచార చిత్రాలు తయారు చేస్తున్నాడు. కమర్షియల్ ప్రాజెక్టులతో పాటు వ్యక్తిగత వేడుకలను కూడా ఏఐతో మరింత అందంగా మారుస్తున్నాడు. పెళ్లి రోజు వేడుకలు, పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలకు తగ్గట్లుగా కస్టమైజ్డ్ పాటలు అద్భుతంగా డిజైన్ చేస్తున్నాడు. తన అద్భుతమైన క్రియేటివిటీతో క్లయింట్లను మెప్పిస్తున్నాడు.

నిన్నటి వరకు సోషల్ మీడియాలో సమయం గడిపిన వైభవ్, ఇప్పుడు భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాడు. ఏఐ ఎంట్రప్రెన్యూర్‌గా మారి చిన్న పిల్లలకు ఏఐ క్లాసులు చెప్పాలనేది అతడి ప్రధాన కోరిక. మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదగాలని నిశ్చయించుకున్నాడు. తనకు 18 ఏళ్లు వచ్చేసరికి కోటి రూపాయలు సంపాదించాలన్నది ప్రస్తుత లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరో పదేళ్లలో, అంటే 2037 నాటికి వంద కోట్ల రూపాయల విలువైన టెక్ కంపెనీని స్థాపించాలని దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తున్నాడు. కేవలం తాను ఎదగడమే కాకుండా, తోటి విద్యార్థులు చదువుకుంటూనే కొత్త నైపుణ్యాలు నేర్చుకుని సంపాదించడం మొదలుపెట్టాలని అతడు కోరుకుంటున్నాడు.

టెక్నాలజీని నేర్చుకోవడానికి ఎలాంటి ప్రత్యేక అర్హతలు అవసరం లేదని వైభవ్ తన ప్రయాణం ద్వారా ప్రపంచానికి చాటిచెబుతున్నాడు. ఇంగ్లీష్ కచ్చితంగా రావాలనే నియమం కానీ, ఫలానా వయసు ఉండాలనే షరతు కానీ ఏఐకి వర్తించవని అతడు స్పష్టం చేస్తున్నాడు. నేర్చుకోవాలనే తపన ఉంటే ఏ వయసు వారైనా ఏఐ టూల్స్ నేర్చుకుని అద్భుతాలు సృష్టించవచ్చు. యువత కేవలం ఒకే ఉద్యోగంపై ఆధారపడకుండా, ఇలాంటి టెక్ నైపుణ్యాలతో అదనపు ఆదాయ మార్గాలు సృష్టించుకోవాలి. సరైన గురువు, నిరంతర సాధన ఉంటే జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో ఈ 13 ఏళ్ల కుర్రాడు అందరికీ ఆదర్శంగా నిలిచి చూపిస్తున్నాడు. మీరు కూడా ఈ ఏఐ గురించి, అవకాశాల గురించి తెలుసుకోవాలంటే 6305241801, 7331112686 నెంబర్లకు కాల్ చేయొచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports