Last Updated:
టీటీడీ విద్యుత్ పొదుపునకు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనవసర వినియోగాన్ని నియంత్రించి, సహజ వనరులను పరిరక్షించాలని ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశించారు.
విద్యుత్ పరిరక్షణ, సహజ వనరుల సద్వినియోగం, స్వయం సమృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. టీటీడీ పరిపాలనా భవనంతో పాటు అన్ని విభాగాల కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అనుబంధ సంస్థల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించి, అనవసర వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర పలు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వనరుల పరిరక్షణ మార్గదర్శకాలు, అలాగే టీటీడీ ముఖ్య ఇంజినీర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
టీటీడీలోని అన్ని విభాగాధిపతులు, కార్యాలయాల అధిపతులు ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ఈవో స్పష్టం చేశారు. కార్యాలయాల్లో అవసరం లేని సమయంలో ఒక్క విద్యుత్ పరికరం కూడా పనిచేయకుండా ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. వినియోగంలో లేని లైట్లు, ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర విద్యుత్ పరికరాలను వెంటనే ఆఫ్ చేయడం ప్రతి ఉద్యోగి బాధ్యతగా పేర్కొన్నారు.
ఎయిర్ కండిషనర్ల వినియోగంపై కూడా టీటీడీ ప్రత్యేక నిబంధనలు అమలు చేయనుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఏసీలను వినియోగించాలని ఆదేశించింది. సెలవు రోజుల్లో ప్రత్యేక అనుమతి లేకుండా ఏసీలను వినియోగించరాదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏసీల విద్యుత్ సరఫరాను కేంద్ర స్థాయిలో విద్యుత్ విభాగం ద్వారా నియంత్రించే విధానాన్ని కూడా అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
విద్యుత్ పొదుపుపై ఉద్యోగుల్లో అవగాహన పెంచేందుకు ప్రతి కార్యాలయంలోని స్విచ్బోర్డులకు గుర్తింపు సంఖ్యలు కేటాయించాలని, విద్యుత్ పొదుపు సందేశాలతో కూడిన బోర్డులను ప్రధాన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. అలాగే అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించాలని, ప్రతి నెల విద్యుత్ వినియోగం, విద్యుత్ బిల్లుల వివరాలను గత ఏడాది ఇదే నెలతో పోల్చి ప్రదర్శించాలని సూచించారు.
విద్యుత్ పొదుపు అనేది కేవలం ఖర్చు తగ్గించడమే కాకుండా సహజ వనరుల పరిరక్షణకు కూడా కీలకమని ఈవో పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా వ్యవహరించి విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా టిటిడి వ్యయాన్ని గణనీయంగా ఆదా చేయవచ్చని తెలిపారు. తనిఖీల్లో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన లేదా అనవసర విద్యుత్ వినియోగం గుర్తిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి వెనుకంజ ఉండదని స్పష్టం చేశారు.
Tirupati,Chittoor,Andhra Pradesh













