Last Updated:
గత కొన్ని సంవత్సరాల క్రితం యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా ఈ బిగ్ టికెట్ లాటరీ గురించి తెలుసుకున్నారు. అప్పటి నుండి వారు ప్రతి నెలా టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నారు.
Big Ticket: నిరంతర ప్రయత్నం, ఓపిక ఉంటే ఎప్పటికైనా అదృష్టం వరిస్తుందని ఢిల్లీకి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబం నిరూపించింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నెలా లాటరీ టికెట్ కొనడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్న ఆ కుటుంబానికి ఎట్టకేలకు ఊహించని అదృష్టం తలుపు తట్టింది. అబుదాబిలో నిర్వహించిన ప్రసిద్ధ ‘బిగ్ టికెట్’ (Big Ticket Series 288) అదృష్ట పరీక్షలో ఢిల్లీకి చెందిన గృహిణి కనికా అరోరా ఏకంగా 25 మిలియన్ దిర్హామ్‌ల (సుమారు రూ. 62 కోట్లు) బంపర్ ప్రైజ్ గెలుచుకున్నారు.
న్యూఢిల్లీలో తన భర్త, ఐదేళ్ల కుమార్తె, అత్తగారితో కలిసి నివసిస్తున్న కనికా అరోరా పేరు మీద జూన్ 30న కొనుగోలు చేసిన టికెట్ నంబర్ ‘476107’కు ఈ భారీ జాక్‌పాట్ తగిలింది. కనికా భర్త గత కొన్ని సంవత్సరాల క్రితం యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా ఈ బిగ్ టికెట్ లాటరీ గురించి తెలుసుకున్నారు. అప్పటి నుండి వారు ప్రతి నెలా టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. అయితే, మొదట్లో భర్త తన పేరు మీదే టికెట్లు కొనేవారని, కానీ ఇటీవల తన భార్య కనిక పేరు మీద టికెట్లు తీసుకోవడం ప్రారంభించారని, అదే తమ అదృష్టాన్ని మార్చేసిందని ఆయన తెలిపారు.
లాటరీ నిర్వాహకుల నుండి గెలుపు సమాచారం అందుకోగానే మొదట నమ్మలేకపోయానని కనిక అన్నారు. “ఆ ఫోన్ కాల్ రాగానే నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను, నోట మాట రాలేదు. కానీ నిజమేనని తెలిశాక నా భర్త, నేను అమితానందంలో మునిగిపోయాము” అని ఆమె మీడియాకు వివరించారు.
ఇంతటి భారీ మొత్తాన్ని ఏం చేయబోతున్నారనే ప్రశ్నకు కనిక సమాధానమిస్తూ, తమ కుటుంబానికి ఒక సొంత ఇల్లు కొనడమే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. అలాగే తమ చిన్నారి కుమార్తెకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెను ‘డిస్నీల్యాండ్’కు తీసుకెళ్తామని ఆనందంగా తెలిపారు. మిగిలిన మొత్తాన్ని కుమార్తె ఉన్నత చదువుల కోసం, కుటుంబ భవిష్యత్తు కోసం పొదుపు, పెట్టుబడులుగా మారుస్తామని వెల్లడించారు.
“ఇది పూర్తిగా అదృష్టం, మన ఓపికపై ఆధారపడి ఉంటుంది. మనపై, దేవునిపై నమ్మకం ఉంచితే ఎప్పటికైనా మంచి జరుగుతుంది” అని కనిక పేర్కొన్నారు. ఇదే డ్రాలో భారతదేశం, బంగ్లాదేశ్‌లకు చెందిన మరో ఐదుగురు తలా 1 మిలియన్ దిర్హామ్‌ల (సుమారు రూ. 2.6 కోట్లు) ఓదార్పు బహుమతులు గెలుచుకోగా, దుబాయ్‌లో నివసిస్తున్న మరో భారతీయ మహిళ ట్వింకిల్ ఆల్ఫిన్ సరికొత్త BMW X6 విలాసవంతమైన కారును గెలుచుకున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













