Last Updated:
ఎప్పుడు ఏ గాలి ఎటు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు టాలీవుడ్‌లోనూ కాక రేపుతున్నాయి. బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ నడుమ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఆ వివరాలు చూద్దామా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు టాలీవుడ్‌లోనూ కాక రేపుతున్నాయి. ఏపీలో కొలువుదీరిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేస్తున్న వరుస విమర్శలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ‘గేమ్ ఆన్’ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ వీరాభిమాని, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ రంగంలోకి దిగారు.
ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితాన్ని సైతం టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ చేసిన ఘాటు విమర్శలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. గత కొంతకాలంగా ఏపీలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరిని ప్రకాష్ రాజ్ తన ‘జస్ట్ ఆస్కింగ్’ (#justasking) వేదికగా తీవ్రంగా ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ల అరెస్టుల పర్వంలో ‘ప్రశ్న రావణ్’ అరెస్టును ఖండిస్తూ ఆయన కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ తీరును ఎండగడుతూ.. “మీరు ఆట మొదలు పెట్టారు… ప్రజలు దానికి ముగింపు పలుకుతారు. గేమ్ ఆన్ (GAME ON) #justasking” అంటూ ఒక పవర్ఫుల్ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
రెచ్చిపోయిన బండ్ల గణేష్.. పర్సనల్ ఎటాక్: ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ జనసైనికులకు, పవన్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ను తన దైవంగా ఆరాధించే బండ్ల గణేష్ నేరుగా రంగంలోకి దిగారు. ప్రకాష్ రాజ్ వృత్తిగత, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ మునుపెన్నడూ లేని విధంగా కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్‌కు అసలు సినిమాలే లేవంటూ కెరీర్‌ను కూడా లాగుతూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు.
రాత్రి తాగుతావు… పొద్దున్నే వాగుతావు… అంతే తప్ప నీ జీవితంలో ఒక్క పని కూడా లేదు. ఒక వ్యాపారం లేదు, ఒక సినిమా లేదు, ఒక షూటింగ్ లేదు. పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు, పనికిరాని గొడవలు… ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకుని, సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు… https://t.co/Okh6KVdTa7
— BANDLA GANESH. (@ganeshbandla) July 6, 2026
“రాత్రి పూట తాగుతావు… పొద్దున్నే లేచి ఏదేదో వాగుతావు… అంతే తప్ప నీ జీవితంలో వేరే పనేమీ లేదు. నీకు ఒక వ్యాపారం లేదు, ఒక సినిమా లేదు, ఒక షూటింగ్ అసలే లేదు. పనికిరాని మాటలు మాట్లాడటం, పనికిరాని పోస్టులు పెట్టడం, అనవసరమైన గొడవలు పెట్టుకోవడం… ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకుని, సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని నీకు నువ్వే నీ విలువను తగ్గించుకోకు” అంటూ ఎక్స్ వేదికగా బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు.
బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ మధ్య ఈ స్థాయి మాటల యుద్ధం జరగడం వెనుక కేవలం పవన్ కళ్యాణ్ పై ప్రేమ మాత్రమే కాదని, పాత పగలు కూడా ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో జరిగిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ – MAA) ఎన్నికల సమయంలోనూ వీరిద్దరి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు వ్యతిరేకంగా బండ్ల గణేష్ అప్పట్లో ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ నేరుగా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడంతో, బండ్ల గణేష్ ఆ పాత లెక్కలన్నీ బయటకు తీసి మరీ గట్టిగా వడ్డించారనే చర్చ నెట్టింట నడుస్తోంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jul 07, 2026 11:22 AM IST













