Last Updated:
టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో భారీ మోసం వెలుగుచూసింది. పిల్ల జమీందార్ దర్శకుడిపై పోలీస్ కేసు నమోదైంది. ఆ వివరాలు చూస్తే..
టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో భారీ మోసం వెలుగుచూసింది. రంగుల ప్రపంచంపై ఉన్న మోజును ఆసరాగా చేసుకుని, యువకులను హీరోలను చేస్తామంటూ నమ్మించి బురిడీ కొట్టిస్తున్న ఘటనలు తరచుగా వింటూనే ఉంటాం. తాజాగా ఇలాంటి ఆరోపణల పైనే ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు (G. Ashok) పై సైబరాబాద్ పోలీసుల ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) అధికారులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నిర్మాత విజయలక్ష్మి పేరు కూడా చేరడంతో సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.
బాధిత యువకుడి తండ్రి హనుమంతరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. తన కుమారుడికి సినిమాలపై ఉన్న ఆసక్తిని గమనించిన హనుమంతరావు.. దర్శకుడు అశోక్ బాబును సంప్రదించారు. ఆ యువకుడిని మెయిన్ లీడ్‌గా పెట్టి ఒక భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తానని, ఇందుకు సంబంధించిన పూర్తి బాధ్యత తనదేనని అశోక్ బాబు నమ్మబలికారు. ఈ అగ్రిమెంట్ తో ప్రాజెక్టును ప్రారంభించేందుకు అశోక్ బాబు పలు దఫాలుగా హనుమంతరావు నుంచి మొత్తం రూ.3.5 కోట్లు వసూలు చేశారు.
అయితే, నెలలు గడుస్తున్నా సినిమా పట్టాలెక్కకపోవడం, ఇచ్చిన మాట ప్రకారం షూటింగ్, ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించకపోవడంతో బాధితుడు నిలదీశాడు. తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయాలని హనుమంతరావు డిమాండ్ చేయగా, దర్శకుడి నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ (EOW) అధికారులు, దర్శకుడు అశోక్ బాబుతో పాటు ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్నారని భావిస్తున్న నిర్మాత విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇరువురిని విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ రూ.3.5 కోట్ల లావాదేవీలు ఎలా జరిగాయి? బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు, వారి మధ్య కుదిరిన సినిమా నిర్మాణ ఒప్పంద పత్రాలు, ఆడియో ఆధారాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విచారణలో నేరం రుజువైతే వీరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.
గుడ్లూరి అశోక్ బాబు తెలుగులో మంచి గుర్తింపు ఉన్న దర్శకుడు. ఆయన గతంలో తెరకెక్కించిన అల్లరి నరేష్ ‘ఆకాశరామన్న’, నాని ‘పిల్ల జమీందార్’, అనుష్క శెట్టి ‘భాగమతి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా ‘భాగమతి’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటి ఒక సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు ఇలా మోసానికి పాల్పడటం పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ఆరోపణలపై దర్శకుడు అశోక్ బాబు లేదా నిర్మాత విజయలక్ష్మి ఇంకా అధికారికంగా స్పందించలేదు. వారి వాదన బయటకు వస్తే కానీ ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలు ఏమిటన్నది పూర్తిగా తెలిసే అవకాశం లేదు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














